అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భీమ్‌గల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఆ విషయం తెలుసన్నారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆడపడుచులకు చీరలు, మహిళలకు వడ్డీలేని రుణాలు (nterest-free loans) పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీలను పక్కనబెట్టి, కేవలం ఓట్ల కోసమే ప్రజలు మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bheemgal | అమలు కాని ప్రధాన హామీలివే..
ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇస్తామన్న తులం బంగారం, చదువుకునే పిల్లలకు ఇస్తామన్న స్కూటీలు ఏమయ్యాయన్నారు. వృద్ధులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000, ప్రతి మహిళకు రూ.2,500 పెన్షన్లు ఎందుకివ్వట్లేదని అడిగారు. రైతులకు రైతుబంధు, బోనస్, విద్యార్థులకు రూ.5 లక్షల విద్య భరోసా కార్డును వెంటనే ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Bheemgal | ప్రశాంత్‌రెడ్డిపై మాట్లాడితే ఊరుకునేది లేదు..
అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ప్రశాంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భీమ్‌గల్ ప్రాంత ప్రజలు ఊరుకోరని దొనకంటి నర్సయ్య హెచ్చరించారు. మోహన్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సహకార శాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గున్నాల భగత్, బోదిరె నర్సయ్య, మల్లెల ప్రసాద్, తుక్కాజీ నాయక్, మహమ్మద్ ఇక్రమ్, రహమన్ సిద్ధిఖీ, సత్య గంగయ్య, యువ నాయకులు రాంచందర్ గౌడ్, జాన్ శ్రీనివాస్, రాగి రాజు, తోగిటి అరుణ్, రామకృష్ణ, రతన్ రాజ్, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.