అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CDS Anil Chauhan | మాటలతో యుద్ధాలు గెలవలేమని పాకిస్థాన్‌కు భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ చురకలు అంటించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్’ (Combined Graduation Parade)లో శనివారం ఆయన పాల్గొన్నారు.
యుద్ధాలను వాక్చాతుర్యంతో మాత్రమే గెలవలేమని సీడీఎస్ అన్నారు. నిజమైన బలం క్రమశిక్షణ, ప్రణాళిక, నిర్ణయాత్మక అమలు నుంచి వస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ (Pakistan) భారీ నష్టాన్ని చవిచూసినప్పటికీ ఆ దేశ నాయకులు తామే గెలిచనట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో సీడీఎస్ వ్యాఖ్యలు చేశారు. “మన చుట్టూ సంస్థాగత దుర్బలత్వం, ప్రతిచర్యాత్మక సర్దుబాట్లను సూచించే పరిణామాలను మనం తరచుగా చూస్తాం. దీనికి విరుద్ధంగా, భారతదేశం బలమైన సంస్థలు, ప్రజాస్వామ్య స్థిరత్వం, మన సాయుధ దళాల తిరుగులేని వృత్తి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది” అని చౌహాన్ అన్నారు.
CDS Anil Chauhan | ఆపరేషన్ సిందూర్..
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగుతోందని సీడీఎస్ తెలిపారు. భారత సాయుధ దళాలలో లోతైన పరివర్తన, సమీకృత నిర్మాణాలు, సంయుక్త కార్యకలాపాలు, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కోసం దేశం చేస్తున్న ప్రయత్నాలు సైనిక శక్తిని పెంచుతున్నాయన్నారు. కొత్తగా వైమానిక దళంలోకి ప్రవేశిస్తున్న వారికి ఆయన పలు సూచనలు చేశారు. ఈసారి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ కిరణ్ విమానాల ఫ్లై-పాస్ట్ విన్యాసానికి నాయకత్వం వహించారు. విమానాలు, సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సీడీఎస్ కొత్తగా నియమితులైన అధికారులకు ‘రాష్ట్రపతి కమిషన్'(Presidential Commission)ను ప్రదానం చేశారు.