అక్షరటుడే, ఇందూరు: Republic Day | జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో (Police Parade Ground) సోమవారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ.. జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
మొత్తం 4.10 లక్షల ఎకరాలలో వివిధ పంటలు రైతులు సాగు చేశారని వివరించారు. ఇందుకు గాను రైతులకు అవసరమైన 1,03,650 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు నాలుగు విడతల్లో లక్ష మంది రైతులకు 782.31 కోట్ల పంట రుణాలు మాఫీ చేశామన్నారు. అంతేకాకుండా వివిధ కారణాలతో మరణించిన 308 రైతులకు సంబంధించిన వారి కుటుంబాలకు రూ. 15.40 కోట్లు రైతు బీమా అందించామన్నారు. రైతు భరోసాకు సంబంధించి 2,72,589 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 316.63 కోట్లు జమ చేశామని తెలిపారు.
Republic Day | ఇందిరమ్మ ఇళ్ల పథకం..
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించిందన్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇళ్లు లక్ష్యం కాగా.. 16,919 ఇళ్లు మంజూరు చేశామన్నారు. 12,850 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. 216 ఇండ్లు పూర్తయ్యాయన్నారు. లబ్ధిదారులకు 266.94 కోట్లు అందజేసినట్లు తెలిపారు.
Republic Day | బ్యాంకు లింకేజీ రుణాలు..
2025-26 సంవత్సరంలో 19,969 సంఘాలకు రూ. 1,228 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా.. ఇప్పటి వరకు 12,700 సంఘాలకు గాను రూ. 1,109 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేశామని ఇలా త్రిపాఠి తెలిపారు. అలాగే వడ్డీ రాయితీకి సంబంధించి 2024-25 వరకు వరకు 40,199 సంఘాలకు రూ. 44.95 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు.
Republic Day | గ్రామీణ ఉపాధి హామీ పథకం..
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 85,034 కుటుంబాలలోని 1,17,886 కూలీలకు 16.08 లక్షల పని దినాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. రూ. 40.52 కోట్ల కూలీల ఖాతాలలో జమ చేసినట్లు పేర్కొన్నారు. కూలీలకు రూ.40.52 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ కింద 21.13 కోట్ల రూపాయలు కలిపి రూ.61.65 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.
Republic Day | విద్యా శాఖ
జిల్లాలో విద్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. 1,158 పాఠశాలల్లో 96,374 విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా 674 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో వివిధ పనులకు రూ. 24.01 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
Republic Day | రహదారులు, భవనాల శాఖ..
జిల్లాలో రోడ్లు, వంతెలన నిర్మాణాలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మాధవనగర్, అర్సపల్లిలలో ఆర్వోబీల నిర్మాణ పనులు రూ. 230 కోట్లతో కొనసాగుతున్నాయన్నారు. రూ. 28.45 కోట్లతో 9 పనులు మంజూరు కాగా.. అభివృద్ధి దశలో ఉన్నాయని చెప్పారు. జిల్లా పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో వివిధ రకాల పథకాల కింద 8,912 అభివృద్ధి పనులను రూ.560.88 కోట్లతో చేపట్టామని ఇలా త్రిపాఠి తెలిపారు. 6097 పనులకు రూ. 453.97 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
Republic Day | నీటి పారుదల శాఖ…
జిల్లాలో రూ. 8.38 కోట్లతో చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల (Choutpalli Hanmanth Reddy) నిర్వహణకు పరిపాలన ఆమోదం తెలిపామని, ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లాలో పది చెక్ డ్యాములు పురోగతిలో ఉన్నాయని, ఇప్పటి వరకు రూ.32.32 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 64,649 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించడానికి 37 ఐడీసీ పథకాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఫతేపూర్, సుబ్బిర్యాల్ , చిట్టాపూర్ సంయుక్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం 9,214 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి ప్రభుత్వం రూ.149.66 కోట్లు పరిపాలనా ఆమోదం తెలిపిందని పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
Republic Day | భూ భారతి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక సంస్కరణల్లో ఒకటిగా భూ భారతి చట్టం – 2025 (Bhu Bharati Act) నిలిచిందని ఇలా త్రిపాఠి అన్నారు. ఈ చట్టం ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందుతున్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్లో 40,462 దరఖాస్తులు అందగా, 17,762 పరిష్కరించదగినవిగా గుర్తించినట్లు చెప్పారు. వాటిలో 3,418 ఆమోదించబడగా.. మిగిలిన 14,344 విచారణ దశలో ఉన్నాయన్నారు.
Republic Day | శాంతి భద్రతలు
ఫ్రెండ్లీ పోలీసింగ్(Friendly policing) విధానాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణకు షి టీంలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు.]
