Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఎస్సారెస్పీ వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం: కలెక్టర్​

Collector Nizamabad | ఎస్సారెస్పీ వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం: కలెక్టర్​

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ: Collector Nizamabad | శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రాజెక్టును సందర్శించారు.

ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ (SRSP Backwater) ఏరియాలతో పాటు దిగువన గల లోతట్టు గ్రామాల పరిస్థితి గురించి కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం ఆయన​ మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్​కు ఎగువన ఉన్న గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు (Vishnupuri project), బాలేగాం, బాబ్లీ బ్యారేజీల (Babli project) నుంచి వరద వస్తోందని కలెక్టర్​కు వివరించారు.

అలాగే నిజాంసాగర్ (Nizamsagar), గడ్డెన్నవాగు, కౌలాస్ నాలా (Koulas nala), లెండి ప్రాజెక్టుల మిగులు జలాలు సైతం ఎస్సారెస్పీలో కలుస్తుండడంతో ఎస్సారెస్పీకి వరద పోటెత్తుతోందని వారు వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ నుంచి శనివారం మధ్యాహ్నం సమయానికి 4.90 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోందన్నారు. దీంతో 39 ఫ్లడ్​గేట్లతో పాటు వరద కాలువ, కాకతీయ, సరస్వతి, లక్ష్మి మెయిన్ కెనాల్స్ ద్వారా దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని కలెక్టర్ వివరించారు.

వరద ఉధృతి వల్ల రిజర్వాయర్ ఎగువ భాగంలోని కందకుర్తి, హున్సా(Hunsa), కొప్పర్గా, హంగర్గా తదితర గ్రామాలను వరద నీరు చుట్టుముట్టిందని.. దీంతో బ్యాక్​వాటర్​ను తగ్గించేందుకు ఎస్సారెస్పీ నుంచి 6 లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని కలెక్టర్​ స్పష్టం చేశారు.

అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద తీవ్రతను సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత లెవెల్ వద్ద నీటి నిల్వలను మెయింటైన్ చేస్తూ, ఎగువ నుంచి వస్తున్న ఇన్​ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Collector Nizamabad | అప్రమత్తంగా ఉండాలి

ఎస్సారెస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేట, ఈత సరదా కోసం ఎవరూ గోదావరి పరీవాహక ప్రాంతం వైపు వెళ్లకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా కొడిచెర్ల, చాకిర్యాల్​, సావెల్, తడపాకల్, దొంచందా, గుమ్మిర్యాల్ గ్రామాల వద్ద ఎవరు కూడా గోదావరి వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని, ప్రాణనష్టం వంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అప్రమత్తతతో కూడిన చర్యలు చేపడుతోందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు.

లోలెవల్ వంతెనలు, కాజ్​వేల మీదుగా, రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న మార్గాలలో ప్రతిచోట అధికారులు, సిబ్బందిని అందుబాటులో ఉంచి, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. వరద ప్రభావిత గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్​ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 1084.5 అడుగులు, 58.357 టీఎంసిల వద్ద నీరు నిలువ ఉందని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ ప్రజ్ఞాన్ మాల్వియా, ఎస్సారెస్పీ, ఇరిగేషన్ అధికారులు శ్రీనివాస్, రామారావు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

Collector Nizamabad | చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పరిశీలన..

ఎస్సారెస్పీ (SRSP) ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన ఉన్న పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేప పిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్​ను సందర్శించారు.

గంబూషియా చేప పిల్లలను (Gambusia fish fry) పెద్ద సంఖ్యలో పెంచాలని, దోమలు వృద్ధి చెందకుండా మురికి నీటి కాల్వలు, నిల్వ నీటి గుంతలలో ఈ చేప పిల్లలను వదలాలని కలెక్టర్ సూచించారు. ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డులలో మురికి కాల్వల్లో గంబూషియా చేప పిల్లలను వదలాలని, అనంతరం బోధన్ భీమ్​గల్​ మున్సిపాలిటీలలో కూడా వదిలేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా.. పూర్తి లక్ష్యం మేరకు నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి జరిగేలా చూడాలని, ఉత్పత్తి కేంద్రంలో పైప్ లైన్లు, ఇతర మరమ్మతు పనులు వెంటనే చేయించాలని జిల్లా మత్స్య శాఖ అధికారి ఆంజనేయ ప్రసాద్ కు కలెక్టర్ సూచించారు.

చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్​