అక్షరటుడే,బోధన్: Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి (Mla sudarshan reddy) అన్నారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి శనివారం ప్రారంభించారు.
ప్రభుత్వ తోడ్పాటుతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులను స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మంది ఇళ్లు నిర్మించుకోవాలని ఆయన సూచించారు.
అంతేకాకుండా లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయిస్తున్నామని, ఐకేపీ (IKP), మెప్మా ద్వారా విరివిరిగా రుణాలు మంజూరు చేయిస్తున్నట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఈ తోడ్పాటును అందిపుచ్చుకుని తన నియోజకవర్గంలోని జైతాపూర్ గ్రామంలో పది మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకున్నారని, మరో 60 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వివరించారు.
అనంతరం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రానికి విద్యుత్ వసతి, మహిళా శక్తి భవనాలకు టాయిలెట్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan reddy), జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఎంపీడీవో శంకర్ నాయక్, తహశీల్దార్ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.
