అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టును టూరిజం స్పాట్‌గా (Tourism spot) అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రాజెక్టు వద్ద ఉన్న గోల్‌బంగ్లా, గార్డెనింగ్, బోటింగ్ పాయింట్ పరిసరాలను పరిశీలించారు.
సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi), నీటిపారుదల శాఖ (Irrigation Department) సీఈ శ్రీనివాస్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో.. దిగువకు వదులుతున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు కట్టను పరిశీలించి అక్కడ పిచ్చిమొక్కలు, వర్షం నీరు నిల్వవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గోల్ బంగ్లా (Goal Bungalow) వద్ద కొనసాగుతున్న టూరిజం పనులను పరిశీలించారు. రూ. 10 కోట్ల వ్యయంతో టూరిజం పనులు కొనసాగుతున్నాయని ఏడాదిలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతం టూరిజం హబ్‌గా మారి పర్యాటకులకు మరింత కనువిందు చేస్తుందని చెప్పారు.
అనంతరం ఆరేడు గ్రామ శివారులోని 20 వరద గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను పరిశీలించారు. మెయింటెనెన్స్‌లో భాగంగా 20 వరద గేట్ల పనితీరును ఇంజినీర్ల బృందం పరిశీలించేందుకే నీటి విడుదల చేపట్టారని కలెక్టర్ వివరించారు. 34 ఏళ్ల కిందట ఈ వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిందని మళ్లీ ఈ ఏడాదే నీటిని విడుదల చేస్తున్నారని ఆయన వివరించారు.
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 85వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా అంతే స్థాయిలో నీటి విడుదలను కిందికి విడుదల చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారుల బృందం నీటి విడుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మంజీర (manjeera) పరీవాహక ప్రాంతంలోకి మత్స్యకార్మికులు, రైతులు వెళ్లవద్దని సూచించారు. వారి వెంట ఈఈ సొలోమాన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, తహశీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో గంగాధర్ శివకుమార్, ప్రాజెక్టు ఏఈ సాకేత్, ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులున్నారు.
