Homeజిల్లాలునిజామాబాద్​Paddy Centers | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం: రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Paddy Centers | తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం: రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వపరంగా కొనుగోలు చేస్తున్నామని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డితో కలిసి గన్నారంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే ఇందల్వాయి: Paddy Centers | అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వంపరంగా కొనుగోలు చేస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి (Rural Mla Bhupathi reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు (Boiled rice mills) తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. తుపాను ప్రభావం వల్ల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. తడిసిన ధాన్యం తరలింపులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, వాటి తరలింపు, రైతులకు బిల్లుల చెల్లింపులు తదితర వివరాల గురించి ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులను కలిసి కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొని ఉన్న పరిస్థితి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించే వివరాలతో కూడిన ట్రక్ షీట్ (Truck sheets) రిపోర్ట్​ను పరిశీలించారు. తడిసిన ధాన్యం విషయమై ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నామని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందుగా తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో 10,500 మెట్రిక్ టన్నుల ధాన్యం అకాల వర్షానికి తడిసినట్టు అంచనా వేశామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టిన ఫలితంగా చాలా వరకు నష్టాన్ని నివారించగలిగిందన్నారు. అయినప్పటికీ అక్కడక్కడా ఆరబెట్టిన ధాన్యం నిల్వలు అకాల వర్షానికి తడిసి పోయాయన్నారు. వీటిని ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లిస్తూ సేకరిస్తోందని తెలిపారు.

రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. అధికారులు అందరూ పరస్పర సమన్వయంతో కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించేలా సమిష్టిగా కృషి చేస్తున్నారని, కేంద్రాల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫలితంగా ఇప్పటికే లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయ్యిందని తెలిపారు.

కాగా.. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేశారు. వీరి వెంట నిజామాబాద్ మార్కెట్ కమిటీ (Nizamabad Market Committee) ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీఎస్​వో అరవింద్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, సివిల్ సప్లయ్స్​​ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ గోపి, తహశీల్దార్ వెంకట్ రావు, ఎంపీడీవో అనంత్ రావు, స్థానిక అధికారులు, రైతులు ఉన్నారు. గన్నారం శివారులో నిర్మాణ దశలో నిలిచిపోయిన డబుల్ బెడ్​రూం ఇళ్ల సముదాయాలను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు వీటిని యథాస్థితిలో కేటాయిస్తూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరయ్యే నిధులతో నిర్మాణాలు పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు.