అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flood Canal | శ్రీరామ్‌సాగర్ (Sriram Sagar)కు ఎగువ నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్‌కు వరద వస్తుండటంతో అధికారులు వరద కాలువ (IFFC) ద్వారా నీటిని మిడ్ మానేరు (Mid Maneru)కు తరలించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇందిరమ్మ వరద కాలువకు నీటి విడుదలను ప్రారంభించారు. కాలువ ద్వారా మూడు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్‌సాగర్‌కు ప్రస్తుతం 1,51,806 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 61.88 టీఎంసీలకు నీటినిల్వ చేరింది. దీంతో మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లకు వరద కాలువ ద్వారా నీటిని తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో కాలువ పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ ఎస్ఈ శ్రీనివాస్‌రావు గుప్తా (Project SE Srinivas Rao Gupta) సూచించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాలని కోరారు. పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, రైతులు కాలువను దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. కాలువలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.