Hyderabad | హైద‌రాబాద్‌లో జ‌ల సంక్షోభం.. దండుకుంటున్న ప్రైవేట్ ట్యాంక‌ర్లు
Hyderabad | హైద‌రాబాద్‌లో జ‌ల సంక్షోభం.. దండుకుంటున్న ప్రైవేట్ ట్యాంక‌ర్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad |తాగునీటి కోసం హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం అల్లాడుతోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(Municipal Corporation) ప‌రిధిలో తీవ్ర నీటి ఎద్ద‌డి నెల‌కొంది. ఈ వేస‌విలో తాగునీటి కోసం జ‌నం ఇక్క‌ట్లు ఎదుర్కొంటున్నారు. ఈ ప‌రిస్థితిని నివారించ‌డంలో యంత్రాంగం విఫ‌ల‌మైంది. మ‌రోవైపు, జ‌ల సంక్షోభం నేప‌థ్యంలో ప్రైవేట్ వాట‌ర్ ట్యాంక‌ర్ల‌కు(Private Water Tankers) భారీగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) ఇప్పటికే నగరం అంతటా 10,000 ట్యాంకర్లను నడుపుతున్నప్పటికీ.. అవి జ‌నం అవ‌స‌రాల‌ను ఏమాత్రం తీర్చ‌లేకపోతున్నాయి. ఈ క్ర‌మంలో ప్రైవేట్ ట్యాంక‌ర్లు జ‌నం సొమ్మును దండుకుంటున్నాయి.

Hyderabad | ట్యాంక‌ర్‌కు రూ.4 వేల‌కు పైగానే..

తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే జ‌ల‌మండ‌లి ప్ర‌జ‌ల అవ‌సరాల‌ను తీర్చ‌డంలో ఘోరంగా విఫ‌లమైంది. వేస‌వి(Summer)లో తలెత్తే వాట‌ర్ డిమాండ్‌కు అనుగుణంగా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌డంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందింది. ప్ర‌ధానంగా కొండాపూర్‌, మాదాపూర్‌, గ‌చ్చిబౌలి వంటి రిచ్ కారిడార్‌లో నీటి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. ఇళ్లకు నీటి స‌ర‌ఫ‌రా చేయ‌డంలో, జ‌నాల అవ‌రాలు తీర్చ‌డంలో వాట‌ర్‌బోర్డు(Water Board) వైఫల్యంతో ప్రైవేట్ ట్యాంక‌ర్ల నిర్వాహ‌కులు రెచ్చిపోతున్నారు. ఒక్కో వాట‌ర్ ట్యాంక‌ర్ ఆప‌రేట‌ర్ రోజుకు క‌నీసం ఐదారు ట్యాంక‌ర్ల నీటిని విక్ర‌యిస్తున్నారు. 25,000 లీటర్ల ట్యాంకర్ ధర దాదాపు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు విక్ర‌యిస్తున్నారు. చిన్న 10,000 లీటర్ల ట్యాంకర్ ధర రూ.1,500 నుండి రూ.2,000 వరకు ప‌లుకుతోంది.

ఈ సంవ‌త్స‌ర‌మే తొలిసారిగా ప్రైవేట్‌ట్యాంక‌ర్ల‌ను(Private Tankers) ఆశ్ర‌యించాల్సి వ‌స్తోంద‌ని కొండాపూర్‌, గ‌చ్చిబౌలి వాసులు చెబుతున్నారు. 1200 ఫీట్ల లోతులోకి బోర్లు వేసినా చుక్కు నీరు రావ‌డం లేద‌ని వాపోతున్నారు. ఇక జ‌ల‌మండ‌లి స‌ర‌ఫ‌రా చేసే నీరు ఏమాత్రం స‌రిపోవ‌డం లేద‌ని, ఏడు, ఎనిమిది గంట‌లు పోయి ఇప్పుడు రెండు గంట‌ల కంటే ఎక్కువ‌గా నీళ్లు రావ‌డం లేద‌ని చెబుతున్నారు. ఒక్కో కుటుంబానికి నీటి అవ‌స‌రాల కోసం వారానికి రూ.2,500 నుంచి రూ.3 వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు.