అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | జపాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం లభించింది. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మోదీ శుక్రవారం ఉదయం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా గాయత్రిమంత్రం(Gayatri Mantram)తో పాటు ఇతర వైదిక మంత్రాలను పఠిస్తూ అక్కడి ప్రజలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. టోక్యోలో అడుగుపెట్టినప్పుడు తనకు లభించిన ఆత్మీయ స్వాగతం కోసం జపాన్‌లోని భారతీయ సమాజాన్ని కూడా ప్రధాని మోదీ(PM Modi) ప్రశంసించారు. “టోక్యోలోని భారతీయ సమాజం ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుంది. మన సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూనే జపనీస్(Japanese) సమాజానికి గణనీయమైన కృషి చేయాలనే వైఖరి నిజంగా ప్రశంసనీయం. రాబోయే గంటల్లో,ఇండియా, జపాన్ మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, వ్యాపార నాయకులతో అభిప్రాయాల మార్పిడిలో పాల్గొనాలని నేను ప్లాన్ చేస్తున్నాను” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
PM Modi | ఆసక్తిగా ఎదురు చూస్తున్నా..
ప్రధాని మోదీ తన పదవీ కాలంలో జపాన్‌లో పర్యటించడం ఇది ఎనిమిదో సారి. ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబా(Japan PM Shigeru Ishiba) ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ చేరుకున్నారు. ఆయన 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అనేక మంది వ్యాపార నాయకులతో కూడా చర్చించనున్నారు. “భారతదేశం, జపాన్ తమ అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్న సందర్భంలో టోక్యో(Tokyo)లో మరోసారి అడుగుపెట్టాను. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఇషిబా, ఇతరులను కలిసి చర్చించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇప్పటికే రెండు దేశాల మధ్య బలంగా ఉన్న భాగస్వామ్యాలను మరింతగా బలోపేతం చేసుకోవడానికి, పరస్కర సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఈ పర్యటనలో అవకాశం లభిస్తుంది” అని ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేశారు.
PM Modi | కీలక రంగాలపై చర్చ..
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన సందర్భంగా జపాన్ ప్రభుత్వం(Japan Government) భారత్‌లో భారీగా పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించే అవకాశముంది. 10 ట్రిలియన్ యెన్ (68 బిలియన్ డాలర్ల) పెట్టుబడి లక్ష్యాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక భద్రతలో సహకారాన్ని అన్వేషించడానికి కొత్త చట్రంపై కూడా ఇద్దరు నాయకుల మధ్య ఒప్పందం కుదిరే అవకాశముంది. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు (AI), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై సహకారాన్ని పెంచుకునే మార్గాలపై కూడా వారు చర్చించనున్నారు.జపాన్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organization) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి చైనాకు వెళతారు. ఆయన ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో ఉంటారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశమవుతానని ప్రధాని మోదీ చెప్పారు.