అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal CI Venkataratnam : వరంగల్ కమిషనరేట్ (Warangal Commissionerate)లో గత కొంతకాలంగా వివాదాస్పద సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా ముద్రవేసుకున్న మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నంపై సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కాగా.. పోలీసు అధికారి కావడంతో తనను ఎవరూ ఏమీ చేయలేరని విధుల్లో ఉన్న సమయంలో చెలరేగిపోయారు.
తాజాగా ఆయన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో ఆ సీఐను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై భూవివాదం కేసు నమోదు చేసి, సస్పెన్షన్కు గురైనట్లు చెబుతున్న ఈ సీఐ లీలలు మరిన్ని వెలుగు చూస్తున్నాయి.
వరంగల్ కమిషనరేట్ పరిధి పరకాల పీఎస్‌లో గతంలో సీఐగా పనిచేసిన వెంకటరత్నం కొంత కాలం క్రితం వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పీఎస్‌కు బదిలీ అయ్యారు. కాగా, స్థానిక మంత్రి(Minister) అనుచరుడి మెప్పుకోసం వాళ్లకు అనుకూలంగా పని చేస్తూ వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తన వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేవిధంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు అతడిపై ఉన్నాయి. కాగా, వరంగల్లో కొద్దిరోజుల క్రితం హత్యకు గురైన ఓ వైద్యుడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.
సదరు వైద్యుడి హత్యకేసులో అతని భార్యే ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసిందని ఆమెను జైలుకు పంపారు. కాగా, జైలులో ఖైదీగా ఉన్న ఆమెను విచారణ పేరుతో మూడురోజుల కస్టడీకి తీసుకున్న సీఐ.. పీఎస్ ఆవరణ (station premises))లోనే ఆ మహిళపై లైంగిక వేధింపుల(sexually harass))కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కస్టడీ అనంతరం ఆమెను జైలుకు తరలించే సమయంలో ఈ విషయం బయటికి పొక్కడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ విచారణ చేపట్టారు. విచారణలో లైంగిక వేధింపులు నిజమని తేలింది. దీంతో ఆ సీఐను సస్పెండ్ చేశారు.
ఈ వివాదాస్పద సీఐపై మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ మంత్రి అనుచరుడి మెప్పుకోసం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. మంత్రి అనుచరుడు చెప్పిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించేవారని, ఈ వ్యవహారాన్ని వీడియో కాల్ ద్వారా చూపెట్టేవారని చెబుతున్నారు.
ఈ క్రమంలో సీఐపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో సీఐ వెంకటరత్నంను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (Warangal Police Commissioner Sunpreet Singh) సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సీఐ సస్పెండ్ కావడంతో వరంగల్‌లోని ఆయన బాధితులు సంబరాలు నిర్వహించుకుంటున్నట్లు తెలిసింది.