అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. ఉత్కంఠగా సాగుతుందనుకున్న వార్ వన్‌సైడ్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావం చూపుతుందని భావించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటింది.
తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిపత్యం కనబరించింది. ఐదు రౌండ్లు ముగిసే సరికే అధికార పార్టీ 12 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగడం విశేషం. గట్టి పోటీ ఇస్తామని, గెలుపు ఖాయమని ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ (BRS) కలలు కల్లలయ్యాయి. తొలి రౌండ్ నుంచే ఆ పార్టీ వెనుకబడింది. ఇక, బీజేపీ (BJP) అయితే కనీస పోటీలో లేకుండా పోయింది. ఫలితంగా కీలకమైన ఉప ఎన్నికలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిపత్యంతో జూబ్లీహిల్స్‌ను కైవసం చేసుకుంది.
Jubilee Hills by-Election | ఫలించిన వ్యూహాలు..
రాష్ట్రంలో చిరునామా గల్లంతయ్యే ప్రమాదకర పరిస్థితి నుంచి అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ గెలుపొందింది. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ పోరులోనూ భారీ విజయం నమోదు చేసింది. ఎంతో కీలకమైన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీఆర్ఎస్‌ను కార్నర్ చేయడం ద్వారా ఆ పార్టీ డిఫెన్స్‌లో పడేసిన కాంగ్రెస్ అనేక ఎత్తుగడలతో గెలుపును సొంతం చేసుకుంది. స్థానికుడైన బీసీ నాయకుడిని పోటీలో పెట్టడం, మైనార్టీలను ఆకట్టుకునేందుకు అజారుద్దీన్‌కు (Azharuddin) మంత్రి పదవి ఇవ్వడం, సినీ కార్మికులు, పేదలను తమవైపు తిప్పుకోవడం తదితర వ్యూహాత్మక అడుగులు వేయడం ద్వారా అధికార పార్టీ సత్తా చాటింది.
Jubilee Hills by-Election | కనిపించని సానుభూతి
అదే సమయంలో ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడంలో సఫలమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీతను (Maganti Sunitha) బరిలో నిలపడం ద్వారా సెంటిమెంట్ పని చేస్తుందని బీఆర్ఎస్ భావించింది. అయితే, ఆ సెంటిమెంట్ పని చేయకుండా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మాగంటి సునీతపై అనేక ఆరోపణలు రావడం బీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బ కొట్టింది. మాగంటి గోపినాథ్ తల్లి చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయి. అదే సమయంలో పోల్ మేనేజ్‌మెంట్‌లో హస్తం పార్టీ సఫలమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయడంతో ఊహించిన దాని కంటే ఎక్కువ మెజార్టీని సొంతం చేసుకుంది.
