అక్షరటుడే, వెబ్డెస్క్: Wanaparthy MLA | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) ప్రశాంతంగా ముగిశాయి. మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీలో లుకలుకలు బయట పడ్డాయి.
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్లో అంతర్గత కలహాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో ఆ విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యంగా పలువురు కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోవడానికి హస్తం పార్టీ నేతలు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంటి దొంగల వల్లే వనపర్తిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 140 జీపీల్లో ఎన్నికలు జరిగాయని చెప్పారు. 62శాతం స్థానాలను తాము గెలిచామన్నారు. అయితే ఇంకా స్థానాలు కైవసం చేసుకోకుండా కొందరు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
Wanaparthy MLA | చిన్నారెడ్డి కారణం
నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమికి చిన్నారెడ్డి (Chinnareddy) కారణం అని మేఘారెడ్డి ఆరోపించారు. చిన్నారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. గతంలో వనపర్తి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. ప్రస్తుతం తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి చిన్నరెడ్డే కారణమని మేఘారెడ్డి ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎంపీ మల్లు రవికి చాలా నష్టం చేశారన్నారు. దీనిపై అధిష్టానం పెద్దలకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆయన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులకు మద్దతు తెలిపారన్నారు. రెబల్ అభ్యర్థులు లేని చోటా బీఆర్ఎస్ (BRS) వారిని గెలిపించాలని ఫోన్లు చేసి చెప్పారని ఆరోపించారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Wanaparthy MLA | కాంగ్రెస్లో కోవర్టులు
పంచాయతీ ఎన్నికలపై ఇటీవల మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారన్నారు. కోవర్టులతోనే ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్ల పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఇటీవల ఆయన మెదక్ జిల్లా (Medak District) నిజాంపేటలో మాట్లాడారు.