Homeలైఫ్​స్టైల్​Walking benefits | వాకింగ్‌తో ప్ర‌యోజ‌నాలెన్నో.. రోజు 7 వేల అడుగులు న‌డిస్తే రోగాలు దూరం

Walking benefits | వాకింగ్‌తో ప్ర‌యోజ‌నాలెన్నో.. రోజు 7 వేల అడుగులు న‌డిస్తే రోగాలు దూరం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Walking benefits | న‌డ‌క.. శారీర‌కంగా, మానసిక ఆరోగ్యానికి దోహ‌దం చేస్తుంది. ఉద‌యం, సాయంత్రం వేళ చేసే వాకింగ్ ఎంతో ఉల్లాసం క‌లిగిస్తుంది. అంతే కాదు, రోజూ 7 వేల అడుగులు న‌డిస్తే ఎంతో ప్ర‌యోజ‌నం చేకూర్చుతుందని, దీర్ఘ‌కాలిక వ్యాధులు సైతం దూర‌మ‌వుతాయ‌ని వెల్ల‌డైంది. ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజుకు కేవలం 7,000 అడుగులు నడవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు (cancer and heart disease) వంటివి ద‌రి చేర‌వ‌ని తేలింది. అలాగే, ఏక్రాగ‌త పెరుగుతుంద‌ని, నిరాశవాదం తొల‌గిపోతుంద‌ని అధ్య‌య‌నం వెల్ల‌డించింది. తీవ్రమైన వ్యాయామాలు లేదా జిమ్ లో గంట‌ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా దీర్ఘాయువును పొంద‌డానికి, శారీర‌క‌, మానసిక ఆరోగ్యం (physical and mental health) పెంపొందించుకోవ‌డానికి వాకింగ్‌ మార్గం సుగ‌మం చేసింది.

Walking benefits | గేమ్ చేంజ‌ర్‌గా 7 వేల అడుగులు

ప్ర‌తి ఒక్క‌రూ రోజుకు 10 వేల అడుగులు న‌డ‌వాల‌ని ఎప్ప‌టి నుంచి ప్ర‌చారంలో ఉంది. 1960 కాలం నుంచి ఇది కొన‌సాగుతోంది. ఫిట్‌నెస్ ట్రైన‌ర్లు (Fitness trainers) కూడా ఇదే విష‌యాన్ని త‌ర‌చూ చెబుతుంటారు. కానీ, 10 వేల అడుగుల‌తో ప్ర‌యోజ‌న‌కరమ‌న్న‌ది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. అయితే, నిత్యం 7 వేల అడుగులు న‌డిస్తే ఎన్నో ప్రయోజ‌నాలున్నాయ‌ని తాజా అధ్య‌య‌నంలో వెలుగు చూసింది. 1.60 ల‌క్ష‌ల మందితో నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో అనేక కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 7,000 అడుగులు నడవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల (heart disease) ప్రమాదం 25%, చిత్తవైకల్యం 38%, నిరాశ 22%, క్యాన్సర్ ముప్పు 6% తగ్గిందని వెల్ల‌డైంది. 2 వేల అడుగులు నడిచిన వారితో పోలిస్తే రోగాల ముప్పు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది.

Walking benefits | బ్ల‌డ్‌, షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లోనే..

క్రమం తప్పకుండా వాకింగ్ చేయ‌డం వల్ల దీర్ఘ‌కాలిక వ్యాధుల ముప్పు త‌గ్గుతుంద‌ని అధ్య‌యనం వెల్ల‌డించింది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం, బ‌రువు తగ్గించడం, మానసిక స్థితిని పెంచే ఎండార్ఫిన్‌ల విడుదలను ప్రోత్సహించడం ద్వారా మెదడు ఆరోగ్యవంతంగా ప‌ని చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, బరువు నిర్వహణకు మద్దతు ఇవ్వడంలో సహాయపడటం ద్వారా గుండెను బలపరుస్తుంది. గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ (heart stroke) ప్రమాదాన్ని తగ్గించడంలో వాకింగ్ కీల‌కంగా మారింద‌ని శాస్త్రీయింగా వెల్ల‌డైంది. ఆసక్తికరంగా, ప్రయోజనాలు 7,000 అడుగులు దాటి సమం అవుతాయని పరిశోధకులు గుర్తించారు.

Walking benefits | న‌డ‌కకు అల‌వ‌డాలి..

కేవ‌లం శారీరక వ్యాయామాల‌తోనే ఆరోగ్య సంర‌క్ష‌ణ ఉంటుంద‌ని చాలా మంది భావిస్తారు. కానీ, వ్యాయామాల మాదిరిగా కాకుండా, న‌డ‌క ద్వారా కాడా సంపూర్ణం ఆరోగ్యం పొంద‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. కేవ‌లం, ఉద‌యం, సాయంత్ర‌మే కాకుండా ప్ర‌యాణంలో, ప‌ని చేసే చోట విరామ స‌మ‌యంలో న‌డ‌క‌ను దిన‌చ‌ర్య‌లో చేర్చుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి కుర్చీల్లోనే కూర్చోకుండా అప్పుడ‌ప్పుడు లేచి నాలుగు అడుగులు వేయాల‌ని పేర్కొంటున్నారు.