అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బీజేపీకి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓట్లను తొలగిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (CPM State Secretary John Wesley) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం (Munnur Kapu Sangam) కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరయ్యారు.
అనంతరం ఆయన ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో (R&B Guest House) విలేకరులతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు (US President) ఏది చెబితే అది వినే పరిస్థితి దేశంలో కనబడుతుందన్నారు. తాను చెబితేనే పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం ఆపిందని ట్రంప్ పలు సార్లు చెబితే అది నిజం కాదని మోదీ అంటున్నారని తెలిపారు. రష్యా లాంటి దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు (trade agreements) చేసుకుని 25 శాతం పన్ను చెల్లించి 50 శాతం నష్టపోతున్నామన్నారు. విదేశీ వాణిజ్యంపై పార్లమెంటులో ఎందుకు చర్చ జరపడం లేదని ప్రశ్నించారు. బీహార్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగిందని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలను సీపీఎం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
Kamareddy | తెలంగాణపై కేంద్రం చిన్నచూపు
తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం పుంజుకునే సమయంలో యూరియాను తగ్గించారన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ (BC reservation) విషయంలో కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. రిజర్వేషన్ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఫలితంగా రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress party) అమలు కాని హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించనున్న ఆందోళనలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సీపీఎం నాయకులు వెంకట్ గౌడ్, మోతీరాం నాయక్, కొత్తపల్లి నర్సింలు, రేణుక తదితరులు పాల్గొన్నారు.