అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో విడుదల చేసిన ఓటరు జాబితా తప్పులతడకగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP district president Dinesh Kulachari) వాపోయారు. ఈ మేరకు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌కు (Municipal Corporation Commissioner Dileep Kumar) శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసిన ఓటరు జాబితా డ్రాఫ్ట్‌లో ఇతర నియోజకవర్గ, జిల్లాల ఓటర్లు ఉండడం ఆశ్చర్యకరమన్నారు.
కార్పొరేషన్ పరిధిలో 3.45 లక్షల ఓట్లకు గాను.. 3.90 లక్షల ఓట్లు చూపించడం సరికాదన్నారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Election Commission of India) వెబ్సైట్లో ఓట్లు సరిగానే ఉన్నాయని, కానీ వార్డుల వారీగా పరిశీలిస్తే పూర్తి తప్పులు తడకగా ఉందని వివరించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఓట్ల ఎన్నికల్లో కూడా ఎటువంటి పొరపాట్లు జరగలేదన్నారు. కానీ ప్రస్తుతం విడుదల చేసిన వార్డుల వారి జాబితాలో ఎందుకు తప్పులు దొర్లాయని ప్రశ్నించారు.
Dinesh Kulachari | బీజేపీ గెలుస్తుందనే భయంతోనే..
ఇందూరులో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందన్న భయంతోనే ఇలాంటి అక్రమాలకు తెరతీస్తున్నారని దినేష్ కులాచారి ఆరోపించారు. ఒక డివిజన్లో ఉండాల్సిన ఓటర్లు మరో డివిజన్లకు ఉండడం, ఇతర జిల్లాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారన్నారు. సమస్యను ఎంపీ అర్వింద్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.