అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనం.. ప్రజాస్వామ్యానికి అవమానమని డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు (DCC President Kailas Srinivas Rao) అన్నారు. ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ (BJP) కోసం ఈసీ ఓట్ల దొంగతనం చేసిందని, ఈసీ చేసిన ఓట్ల దొంగతనంతో నేడు మోదీ ప్రధాని పీఠంపై కూర్చున్నారని ఆరోపించారు.
ఈ నెల 7న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (AICC leader Rahul Gandhi) ప్రెస్ మీట్ పెట్టి ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో స్పష్టమైన ఆధారాలతో కళ్లకు కట్టినట్టుగా చూపించారన్నారు. ఈసీ, బీజేపీ రెండు ఒకటే అని నిరూపించారని తెలిపారు. ప్రధాని పీఠంపై నరేంద్ర మోదీ (PM Narendra Modi) దొడ్డి దారిన కూర్చున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ (Election Commission) కళ్లు తెరిచి ఓటరు జాబితాను నిష్పక్షపాతంగా వ్యవహరించి తప్పులను సరిదిద్ది ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎవరైనా తమ అనుమానాలను అడిగితే ఈసీ వారిని బెదిరించే ధోరణి మానుకోవాలని సూచించారు. బీహార్ ఎన్నికలు (Bihar elections) బ్యాలెట్‌తో నిర్వహించి ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలని, దీంతో బీజేపీ అసలు రంగు బయటపడుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సరిదిద్దుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయినా ఇలాగే కొనసాగితే ఎన్నికలు బహిష్కరించే రోజులు కూడా వస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, గోనె శ్రీనివాస్, గుడుగుల శ్రీనివాస్, పాత శివ కృష్ణమూర్తి, రాజా గౌడ్, ఐరేని సందీప్, పంపరి లక్ష్మణ్, లక్ష్మీరాజ్యం, మసూద్, రాంకుమార్ గౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.