అక్షరటుడే, వెబ్డెస్క్: Japan Volcano Eruption | జపాన్‌లో అగ్నిపర్వతం బద్ధలైంది. పశ్చిమ జపాన్ ద్వీపం క్యుషులోని సకురాజిమా అగ్నిపర్వతం (Sakurajima volcano) వద్ద ఆదివారం తెల్లవారుజాము సమయంలో భారీ పేలుళ్లు సంభవించాయి.
మొదటి పేలుడు అర్ధరాత్రి ఒంటి గంటలకు జరిగింది. ఆ తరువాత మరో రెండు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి బూడిద ఆకాశంలో 4.4 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడినట్లు సమాచారం. గత 13 నెలల్లో బూడిద ఇంత ఎత్తుకు చేరుకోవడం ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.
కగోషిమా నగర (Kagoshima City) పరిసర ప్రాంతాల్లో దట్టమైన బూడిద పొర అలుముకుంది. భద్రతా కారణాల దృష్ట్యా స్థానిక విమానాశ్రయం నుంచి దాదాపు 30 విమానాలు రద్దు చేశారు. దీంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. నగర పరిపాలన అధికారులు మాట్లాడుతూ.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు.
సకురాజిమా అగ్నిపర్వతం వద్ద చిన్న చిన్న విస్ఫోటనాలు సర్వసాధారణమని స్థానిక మీడియా కథనం. కానీ ఈసారి పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని.. బూడిద, వేడి వాయువులు ఎక్కువగా బయటకు వచ్చాయని పేర్కొన్నాయి. ఈ తాజా అగ్నిపర్వత విస్ఫోటనం జపాన్ “రింగ్ ఆఫ్ ఫైర్” (Ring of Fire) ప్రాంతంలో ఉంది. ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు నిరంతరం ఆందోళన కలిగిస్తాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
