Homeభక్తిAashada Masam | విష్ణు పూజ.. గురు ఆరాధన.. అమ్మకు బోనం.. ఎన్నో విశిష్టతల మాసమే...

Aashada Masam | విష్ణు పూజ.. గురు ఆరాధన.. అమ్మకు బోనం.. ఎన్నో విశిష్టతల మాసమే ఆషాఢం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aashada Masam | హిందూ క్యాలెండర్‌ (Hindu calendar) ప్రకారం సంవత్సరంలో వచ్చే నాలుగో మాసం ఆషాఢం (Ashadam).

ఇది ఎన్నో విశిష్టతలున్న నెల. ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన మాసం. ఆషాఢంలో శ్రీమహావిష్ణువు(Sri Maha Vishnu)ను పూజించడం, దానధర్మాలు, యజ్ఞ యాగాలు చేయడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ నెలలోనే ఆధ్యాత్మిక విశిష్టత గల చాతుర్మాస్య వ్రతం (Chaturmasya Vratam) ప్రారంభమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ దేవతలైన ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ వంటి అమ్మవార్లకు బోనాలు(Bonalu) సమర్పించేదీ ఈ మాసంలోనే..

ఈనెలలో పుర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలొస్తాయి. ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండింటి మధ్య ఉంటాడు.. అందుకే ఈ మాసాన్ని ఆషాఢ మాసం అని పిలుస్తారని ఆధ్యాత్మికవేత్త రుద్రమణి శివాచార్య పేర్కొంటున్నారు. ఈ మాసంలో శ్రీమహా విష్ణువుతో పాటు శివుడు, దుర్గామాత, హనుమాన్‌(Hanuman), సూర్యదేవుడు, అంగారకుడిని పూజించాలని సూచిస్తున్నారు. ఎన్నో ఆధ్యాత్మిక విశిష్టతలున్న ఆషాఢ మాసం ఈనెల 26న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆషాఢమాస విశిష్టతలు తెలుసుకుందామా..

Aashada Masam | ఈ నెలలో ఏం చేయాలి..

ఆషాఢ మాసంలో యజ్ఞాదులు చేయాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఆషాఢమాసం వర్షాకాలంలో వస్తుంది. హవనం, లేదా యాగం నిర్వహించడం వల్ల హానికరమైన కీటకాలు నశిస్తాయి. గాలి శుద్ధి అవుతుంది. అందుకే యజ్ఞం నిర్వహించాలని సూచించారు. మట్టి కుండ, గొడుగు, ఉప్పు తదితర వస్తువులను దానం చేయాలని కూడా చెబుతారు. ఇవి కూడా నిత్య జీవితంలో ప్రధానంగా వర్షాకాలంలో ఉపయోగపడే వస్తువులే.. ఆషాఢ మాసం శ్రీమహావిష్ణువును పూజించడానికి అనువైన సమయం. రోజూ విష్ణు పూజ, గంగానదిలో పవిత్ర స్నానం, తీర్థయాత్రలు చేయడం శుభప్రదంగా భావించబడుతోంది.

పురాణాల ప్రకారం ఈ కాలంలో శ్రీమహా విష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. అందుకే ఈ కాలంలో శుభకార్యాలుండవు. రోజూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శారీరక బాధలన్నీ తొలగిపోతాయని, శివాలయానికి వెళ్లి పూజలు చేయడం వల్ల కాల సర్ప దోషం తొలగిపోతుందని, శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తులు భావిస్తారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడాన్ని మహిళలు శుభప్రదంగా భావిస్తారు. ఇది సౌభాగ్యాన్ని తెస్తుందని నమ్ముతారు.

Aashada Masam | ముఖ్యమైన తిథులు..

జూన్‌ 26 : ఆషాఢ మాసారంభం.
జూన్‌ 27 : ఈ రోజు ఒడిశాలోని పూరీలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర(Jagannath Rath Yatra) జరుగుతుంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల రథ ఊరేగింపును కనుల పండువగా నిర్వహిస్తారు. ఇస్కాన్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా రథయాత్రలను నిర్వహిస్తూ ప్రజలలో ఆధ్యాత్మిక చింతనను పెంచుతోంది.
జూన్‌ 30 : స్కంధ పంచమి.
జూలై 6 : ఆషాఢ శుక్ల ఏకాదశి. దీనిని దేవశయని ఏకాదశి అని, తొలి ఏకాదశి(Toli ekadashi) అని వ్యవహరిస్తారు. ఈరోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారని భావిస్తారు. ఈ రోజు విష్ణువు పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, తులసి పూజ, ఉపవాసం, దానధర్మాలు చేయాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఈరోజు నుంచి పునర్వసు కార్తి ప్రారంభమవుతుంది.

జూలై 7 : ఆషాఢ శుక్ల ద్వాదశి. ఈ తిథి చాతుర్మాస వ్రతం యొక్క మొదటి రోజుగా కొనసాగుతుంది. విష్ణు భక్తులు ఈ రోజు ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి సారిస్తారు. దీప దానం మరియు గ్రామ దేవతల పూజలు జరుగుతాయి.
జూలై 10 : ఆషాఢ శుక్ల పూర్ణిమ. దీనిని గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అని వ్యవహరిస్తారు. గురువులకు అంకితమైన ఈ రోజు వేద వ్యాసుని జన్మదినంగా జరుపుకుంటారు. గురువులను సన్మానించడం, జ్ఞాన సాధనలు చేస్తారు.
జూలై 20 : పుష్యమి కార్తి ప్రారంభం.
జూలై 24 : ఆషాఢ కృష్ణ అమావాస్య. పితృదేవతలకు అంకితమైన ఈ తిథి.. పూర్వీకులకు తర్పణం, పిండ దానం చేయడానికి అనువైన రోజు. గ్రామ దేవతల ఆరాధన, అశ్వత్థ వృక్ష (రావి చెట్టు) పూజ కూడా చేస్తారు. గ్రామాల్లో అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారు.

Must Read
Related News