అక్షరటుడే, వెబ్డెస్క్: Vishakapatnam | విశాఖ నగరంలో ఓ భర్త ఫిర్యాదుతో సంచలనంగా మారిన పేకాట కేసు వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పేకాట స్థావరాలపై గుట్టుచప్పుడు కాకుండా నిఘా పెట్టి దాడులు చేయడం చూస్తూనే ఉంటాం. కానీ, ఈసారి మాత్రం ఓ భర్త తన భార్యే అక్రమంగా పేకాట ఆడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషంగా మారింది. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు (Task Force Police) పకడ్బందీగా సమాచారం సేకరించి పేకాట స్థావరాన్ని గుర్తించి ఆకస్మికంగా దాడికి దిగారు. విశాఖలోని లలిత్‌నగర్‌లో ఉన్న ఓ నివాసంలో పేకాట స్థావరం (Poker Base) నడుస్తోందనే సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ మరియు ఫోర్త్ టౌన్ పోలీసు బృందాలు సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించాయి.
Vishakapatnam | ఇదెక్కడి ఘోరం…
దాడి సమయంలో అక్కడ ఆరుగురు మహిళలు పేకాడుతున్న దృశ్యాలను పట్టుబట్టి, వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో పోలీసులు రూ. 22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న మహిళలపై గాంబ్లింగ్ యాక్ట్ (Gambling Act) కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించి, మిగిలిన వివరాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఒక మహిళ భర్తే ఆమెను పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఆమె రోజూ పేకాట ఆడుతోందని, మధ్యాహ్న సమయాల్లో ఇంటికి రాకుండా ఉంటుందని చెప్పిన భర్త, తన భార్య క్రమశిక్షణ తప్పుతోందని, కుటుంబ బాధ్యతలను విస్మరిస్తోందని ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, టాస్క్ ఫోర్స్ బృందంతో (Task Force Team) కలిసి స్థావరంపై దాడి చేశారు. పేకాట స్థావరం ఎప్పటి నుంచి నడుస్తోంది? ఇందులో ఇంకా ఎవెవరు కలిసివున్నారు? ఈ మహిళలు ఎవరి ఆధ్వర్యంలో గుంపుగా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
మరికొంత మంది మహిళలు లేదా ఇతరులు ఇందులో భాగంగా ఉన్నారా అన్న దానిపై ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించి, తదుపరి దర్యాప్తు వేగవంతం చేశారు. వైజాగ్‌లో (Vizag) ఇటీవల పేకాట స్థావరాలు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఇప్పుడే నిఘా పెంచుతున్నారు. కుటుంబాల్లో ఇలా మహిళలే ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడటం పోలీసులను, స్థానికులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. “ఇలా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట గుంపులపై గట్టి నిఘా పెట్టాం. ఏ స్థానికుడైనా, కుటుంబ సభ్యుడైనా అసభ్య కార్యకలాపాలు చూస్తే ఫిర్యాదు చేయొచ్చు. పూర్తి గోప్యతతో చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.