అక్షరటుడే, వెబ్డెస్క్ : Visakhapatnam | జీవీఎంసీ (GVMC) అధికారుల చర్యలతో విశాఖ జైలు రోడ్ నైట్ ఫుడ్ కోర్ట్ వద్ద ఉద్రిక్తత చెలరేగింది. GVMC రెవెన్యూకు నష్టం జరుగుతోందన్న ఆరోపణలతో ఫుడ్ కోర్టు(Food Court)లో ఉన్న 160 దుకాణాల తొలగింపు చర్యలు చేపట్టగా, ఈ క్రమంలో దుకాణదారులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.
GVMC కౌన్సిల్ తీర్మానాలకు అనుగుణంగా ఆక్రమణల తొలగింపు జరగుతున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్ రావు పేర్కొన్నారు. సెంట్రల్ పార్క్(Central Park) ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డులో 160 షాపులు అనధికారంగా నిర్వహించబడుతున్నాయని, వీటివల్ల స్థానిక సంస్థకు ఆదాయం రావడం లేదని ఆయన వివరించారు.
Visakhapatnam | ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం
ఈ ఘటనపై వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్(MLA Vamsi Krishna Srinivas) తీవ్రంగా స్పందించారు. స్థానిక ప్రజా ప్రతినిధిని అవహేళన చేస్తూ తనకు తెలియకుండానే షాపులు తొలగించడాన్ని అవమానంగా అభివర్ణించారు. మేయర్, కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేస్తూ పేద ప్రజల జీవనాధారాన్ని తొలగించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.పేద ప్రజలకు న్యాయం చేయాలి. రెంట్లు ఫిక్స్ చేసి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. చట్టబద్ధంగా దుకాణదారులకు సహాయం చేయాలి గానీ, దుర్మార్గంగా జీవనాధారాన్ని తొలగించడం సహించదు,” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.GVMC ప్రకారం, 60మంది దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను తొలగించారు. మిగిలినవారు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, స్థానికులు తమ జీవనోపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
GVMCకి వచ్చిన అనేక ఫిర్యాదుల ఆధారంగా అక్రమ డబ్బు వసూళ్లు, ట్రాఫిక్ ఇబ్బందులు(Traffic Problems) వంటి అంశాలపై కూడా పరిశీలనలు జరిగాయని అధికారులు తెలిపారు.జైలు రోడ్ ఫుడ్ కోర్ట్ నైట్ టైంలో విశాఖ ప్రజలకు ఆకలి తీర్చే స్థలం. అందుబాటు ధరల్లో వంటకాలు అందుబాటులో ఉండటం వల్ల పలు వర్గాల ప్రజలు తరచూ అక్కడికి చేరుకుంటారు. ఆకస్మికంగా దుకాణాల తొలగింపు వలన నగర జనజీవనం ప్రభావితమవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు