Homeక్రీడలుVirender Sehwag | అప్పుడు స‌చిన్ ఆపాడు, లేక‌పోతే.. అప్ప‌టి విషయం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు...

Virender Sehwag | అప్పుడు స‌చిన్ ఆపాడు, లేక‌పోతే.. అప్ప‌టి విషయం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన సెహ్వాగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virender Sehwag | టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ , తాజాగా తన క్రికెట్ కెరీర్‌లో ఒక కీలక మలుపు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2011లో భారత జట్టు(Indian Team) వన్డే ప్రపంచకప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన సెహ్వాగ్, ఆ టైటిల్‌కు మూడు సంవత్సరాల ముందు తనను తాను వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుదామనుకున్నానని చెప్పాడు. కానీ ఆ నిర్ణయం తీసుకోకుండా సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అడ్డుకున్నాడ‌ని పేర్కొన్నాడు.

Virender Sehwag | రిటైర్మెంట్‌పై కామెంట్స్..

‘2007-08లో కామన్ వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయాను. అందుకే అప్పటి కెప్టెన్ ధోని నన్ను తుది జట్టులోకి తీసుకోలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన నేను ఇంకా వన్డేలు ఆడటం అవసరమా? అనే స్థాయిలో ఆలోచించాను. రిటైర్మెంట్ తీసుకుందామ‌ని అనుకున్నాను’ అని సెహ్వాగ్ (Virender Sehwag)​ చెప్పాడు. ఈ సమయంలో తన నిర్ణయాన్ని సచిన్ టెండూల్కర్‌తో పంచుకున్నానని తెలిపాడు. అప్పుడు సచిన్ స్పందిస్తూ.. ఇలాంటిదే నాకు కూడా 1999-2000లో ఎదురైంది. క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాలనిపించింది. కానీ ఆ దశ తాత్కాలికం. భావోద్వేగాలతో కాదు.. స్థిరమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఇంకొన్ని సిరీస్‌లు ఆడిన తర్వాత ఆలోచించు అని సలహా ఇచ్చాడని సెహ్వాగ్ వెల్లడించాడు.

ఆ మాటలు తనను మళ్లీ ధైర్యంగా నిలబెట్టాయని, ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి ఫామ్​లోకి వచ్చానని పేర్కొన్నాడు. తద్వారా 2011లో వరల్డ్‌కప్(2011 World Cup) జట్టులో స్థానం సంపాదించగలిగానన్నాడు. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన సెహ్వాగ్, 2001లో దక్షిణాఫ్రికాతో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అలా కెరీర్ ప్రారంభించి, త‌న‌దైన స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సెహ్వాగ్ త‌న కెరీర్‌లో 251 వ‌న్డే మ్యాచ్‌లు, 104 టెస్టులు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన విష‌యం తెలిసిందే. ఇక టెస్టుల్లో రెండు సార్లు త్రిపుల్ సెంచ‌రీ చేసిన ఏకైక భార‌త ఆట‌గాడిగా సెహ్వాగ్ స‌రికొత్త రికార్డులు సృష్టించాడు.