అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Virat Kohli | భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు.
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న కోహ్లీ, తాజాగా ఇండోర్ స్టేడియంలో (indoor stadium) ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ ప్రాక్టీస్ సమయంలో గుజరాత్ టైటాన్స్ అసిస్టెంట్ కోచ్ నయీమ్ అమీన్ తో కలిసి శ్రమిస్తున్న ఫోటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. ఆ ఫోటోకు జతగా.. “ప్రాక్టీస్‌లో సాయం చేసినందుకు థ్యాంక్స్ బ్రదర్. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.” అంటూ రాసుకొచ్చాడు.
Virat Kohli | ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..
కోహ్లీని ఆగష్టులో మళ్లీ మైదానంలో చూడాలని భావించిన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. భారత్-బంగ్లాదేశ్ వన్డే సిరీస్ ఈ నెలలో జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఈ సిరీస్‌ను 2026 సెప్టెంబరుకు వాయిదా వేశారు. కొన్ని కారణాల వలన బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్యాన్స్ ఇప్పుడు అక్టోబర్ వరకూ ఎదురుచూడాల్సిందే.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ మళ్లీ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా కోహ్లీతో పాటు జట్టులోకి చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కోహ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి ప్రాక్టీస్ మోడ్‌లోకి వెళ్లడంతో, తిరిగి మైదానంలో ఆయన మెరుపులు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా, కొద్ది నెలల క్రితం టీ20, టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి ప్రస్తుతం లండన్‌లోనే ఉంటున్నాడు. తన భార్య అనుష్క శర్మ (Anushka Sharma), పిల్లలు వామికా ,అకాయ్‌లతో కలిసి పూర్తిగా లండన్‌లోనే జీవనం కొనసాగిస్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత లండన్‌లో ఉండాలని ఈ జంట ప్లాన్ చేయగా, వారి నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇక విరాట్ కోహ్లి కేవలం వన్డే ఫార్మాట్‌లోనే ఆడనుండగా, బహుశా 2027 వన్డే వరల్డ్‌కప్ తర్వాత విరాట్ రిటైర్ కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లోపే రోహిత్, కోహ్లిలు రిటైర్మెంట్ ప్రకటించేలా బీసీసీఐ ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా వార్తలు రావడం మనం చూశాం.