అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Virat Kohli | భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారిగా కనిపించకపోవడం సోషల్ మీడియా (Social Media)లో కలకలం రేపుతోంది. 270 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీలలో ఒకరిగా విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆయన ఖాతా అకస్మాత్తుగా మాయం కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు.
ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన కోహ్లీ అకౌంట్ ఇలా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ బ్రాండ్. క్రికెట్‌కు సంబంధించిన అప్డేట్స్తో పాటు తన వ్యక్తిగత జీవితం, ఫిట్నెస్, సామాజిక అంశాలు, కొన్నిసార్లు రాజకీయ అంశాలపై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.
Virat Kohli | సడెన్‌గా మాయం..
అలాంటి స్టార్ అకౌంట్ ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్ (Instagram)లో సెర్చ్ చేసినా కనిపించకపోవడం ఫ్యాన్స్‌లో కొత్త డౌట్లకు కారణమైంది. కోహ్లీ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాడా? లేక ఇన్స్టాగ్రామ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా అతని ఖాతాపై సస్పెన్షన్ విధించిందా? అన్న అంశాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటన ఏదీ లేకపోవడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీ అకౌంట్ మాయమైందనే అంశంపై ట్విట్టర్ (X) వేదికగా పెద్ద చర్చ మొదలైంది. అభిమానులు విభిన్న రకాల ఊహాగానాలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఇన్స్టాగ్రామ్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నిరసనగా ఇన్‌స్టా యాప్‌ను డిలీట్ చేస్తున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.
అలాగే విరాట్ కోహ్లీ అకౌంట్ ఎందుకు డీయాక్టివేట్ అయిందో చెప్పాలంటూ ఆయన సతీమణి, నటి అనుష్క శర్మ (Anushka Sharma) సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ పరిణామంతో సోషల్ మీడియా మొత్తం కోహ్లీ పేరుతో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్స్టాగ్రామ్ లేదా విరాట్ కోహ్లీ నుంచి అధికారిక స్పష్టత వచ్చే వరకు ఈ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానులు మాత్రం తమ అభిమాన క్రికెటర్ అకౌంట్ త్వరలోనే తిరిగి యాక్టివ్ అవుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు