అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. భీమ్‌గల్‌లోని ఫంక్షన్ హాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని(Election Code of Conduct) ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Bheemgal | శాంతియుత వాతావరణం దెబ్బతినొద్దు
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల కోసం గ్రామాల్లో శాంతి యుత వాతావరణం చెడగొట్టొద్దని సీఐ సూచించారు. ఎన్నికలు వస్తాయ్.. పోతాయ్.. కానీ గ్రామాల్లో శాశ్వతంగా ఉండేది మనమే అని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలిచేది ఒక్కరే అని గుర్తేరుగాలని తెలిపారు. ఎన్నికలను స్పోర్టివ్‌గా తీసుకోవాలని హితవు పలికారు. గ్రూప్ రాజకీయం చేసి అల్లర్లు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Bheemgal | అనుమతులు పొందాలి
పోటీల్లో ఉన్న అభ్యర్థులు బైక్ ర్యాలీ, లౌడ్ స్పీకర్ ఏర్పాటు, సమావేశాల ఏర్పాటు కోసం అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాలని సీఐ తెలిపారు. ఎవరైనా ఓటర్లను మద్యం, డబ్బులతో ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.
Bheemgal | వారిని ఏజెంట్లుగా నియమించొద్దు
ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ క్రిమినల్ హిస్టరీ ఉన్న వారిని పోలింగ్ ఏజెంట్లుగా(Polling agents) నియమించొద్దని అభ్యర్థులకు సూచించారు. జమ ఖర్చుల వివరాల గురించి అవగాహన కల్పించారు. రూ.5వేల లోపు జనాభా ఉంటే రూ. లక్షా 50 వేలు, ఆ పైన ఉంటే రూ. 2 లక్షల వరకు మాత్రమే ఎన్నికల ఖర్చు పెట్టాలన్నారు. పోలింగ్ రోజు కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే అభ్యర్థులు ఉండాలని వివరించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రంలో అధికారులకు సహకరించాలన్నారు. ఎన్నికల అధికారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లఘించి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పారు. సమావేశంలో తహశీల్దార్ షబ్బీర్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రామన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.