అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vijayawada Durga Temple | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ Vijaywada ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి శనివారం ఉదయం అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రూ.3.08 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయి పడటంతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APCPDCL) అధికారులు విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. అయితే, విషయం రాష్ట్ర మంత్రుల దృష్టికి వెళ్లడంతో కొన్ని గంటల వ్యవధిలోనే సరఫరాను తిరిగి పునరుద్ధరించారు.
Vijayawada Durga Temple | ఎందుకు విద్యుత్ నిలిపివేశారు?
శనివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో విద్యుత్ శాఖ (electricity department) సిబ్బంది దుర్గగుడికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆలయ నిర్వహణ కమిటీ విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఏపీసీపీడీసీఎల్ అధికారులు వెల్లడించారు.అయితే, ఈ ఆరోపణలను ఆలయ నిర్వహణ కమిటీ ఖండించింది. ఆలయం ఏర్పాటు చేసిన ఒక మెగావాట్ సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్ నుంచి గ్రిడ్‌కు సరఫరా చేస్తున్న విద్యుత్ లెక్కల్లోనే సమస్య ఉందని పేర్కొంది.
నెట్ మీటరింగ్ ఒప్పందం సక్రమంగా అమలు కావడం లేదని, అందుకే బకాయిలు తప్పుగా చూపిస్తున్నారని ఆలయ ఈవో శీన నాయక్ తెలిపారు. పాతపాడు ప్రాంతంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సోలార్ ప్లాంట్ ద్వారా ఆలయంలోని పది రకాల సేవలకు ఉచిత విద్యుత్ అందించాల్సి ఉండగా, విద్యుత్ శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆలయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
విద్యుత్ సరఫరా నిలిచిన వెంటనే ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. జనరేటర్ల సహాయంతో అమ్మవారి దర్శనాలు, ప్రసాదాల తయారీ, లిఫ్టుల నిర్వహణ వంటి సేవలను కొనసాగించారు. దీంతో దర్శనార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు.
భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తొందరపాటు చర్యలు వద్దని మంత్రి గొట్టిపాటి (Minister Gottipati) విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మంత్రుల జోక్యంతో అధికారులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో దుర్గగుడికి (Durga Temple) విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే ఈ సమస్యలని పరిష్కరించేందుకు ఈ సమావేశంలో కొంత బకాయి మొత్తాన్ని చెల్లించి, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నట్లు తెలిపారు.