అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Thalapathy | తమిళ సినీనటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత ఇళయతలపతి విజయ్ మధురైలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో తన పదునైన పదజాలంతో ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ మహానాడులో ఆయన ప్రసంగం పార్టీ కార్యకర్తలను మాత్రమే కాక, తమిళ రాజకీయ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. విజయ్ (Vijay Thalapathy) తన ప్రసంగంలో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “షూటింగ్‌కి వచ్చి వెళ్తూ అధికారాన్ని సాధించలేరు” అంటూ రాజకీయాల్లోకి వస్తున్న సినీనటులపై చేస్తున్న విమర్శలకు తన ప్రయాణం భిన్నమని స్పష్టం చేశారు విజయ్. “నేను ఆశ్రయం కోసం రాలేదు, ఆయుధంతో వచ్చాను,” అంటూ తాను నాయకత్వం వహించడానికి సిద్ధమై ఉన్నదాన్ని బలంగా తెలియజేశారు.
Vijay Thalapathy | గర్జించిన విజయ్..
డీఎంకే నేత స్టాలిన్‌పై (DMK Leader Stalin) తీవ్రంగా విరుచుకుపడిన విజయ్, “స్టాలిన్ అంకుల్ అంటూ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. డీఎంకే బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటుందని ఆరోపించారు. మహిళల భద్రత, అన్నా యూనివర్సిటీ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. సినీ పరిశ్రమలో (Film Industry) పేరుగాంచిన తరువాతే రాజకీయాల్లోకి వచ్చే నేతలపై విమర్శలు చేస్తూ, తాను మార్కెట్ కోల్పోయి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంగా చెప్పారు. ప్రజలను తాను గెలవలేనని అనుకోవడం సరికాదని, తనకు మద్దతుగా వచ్చే జనసమూహం ఓట్లు మాత్రమే కాక, ప్రజా వ్యతిరేక పాలకులకు వేటాడే సింహంగా మారుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) మధురై తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు విజయ్ ప్రకటించారు. త్వరలో మధురై జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. టీవీకే అభ్యర్థికి ఓటు వేయడం అంటే “నాకు ఓటు వేయడమే” అని స్పష్టం చేశారు. టీవీకే రహస్య ఒప్పందాలు చేయదు, మోసం చేయదు, ఎవరికీ భయపడదు” అని విజయ్ స్పష్టం చేశారు. తమిళ ప్రజలు, మహిళలు, యువత తమతో ఉన్నారన్న ధైర్యంతో పార్టీ ముందుకు వెళ్తోందన్నారు.
“సింహం ఎప్పుడూ వేటాడడానికే వస్తుంది, సరదా కోసం కాదు” అనే మాటలతో తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు. విజయ్ చివరగా, “1967, 1977 రాజకీయ మార్పులను మళ్లీ 2026లో చూస్తారు” అంటూ, తమిళనాడు రాజకీయాల్లో విశేష మార్పు రాబోతుందని సంకేతమిచ్చారు. ఆయన మాటల్లోని ధైర్యం, విమర్శల పదును, యువతను ఆకర్షించే నిబద్ధత.. ఇవన్నీ కలిస్తే టీవీకే రాబోయే ఎన్నికల్లో కీలక భూమిక పోషించనుందన్న భావనకు బలం చేకూరుతోంది.