అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madras High Court | కోలీవుడ్ అగ్రనటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా తెరకెక్కిన భావోద్వేగ థ్రిల్లర్ ‘జన నాయగన్’ చుట్టూ నెలకొన్న సెన్సార్ వివాదం తాజాగా కీలక మలుపు తిరిగింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, తెలుగులో భారీ విజయం సాధించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) కథాంశాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించబడింది.
పూర్తిస్థాయి రీమేక్ కాకుండా, దాదాపు 70 శాతం కథను తీసుకుని తమిళ ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారానే స్పష్టమైంది.జనవరి 9న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ సినిమా, సెన్సార్ అనుమతుల విషయంలో తలెత్తిన అభ్యంతరాల కారణంగా వాయిదా పడింది. సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో సినిమా సర్టిఫికెట్ ప్రక్రియ ఆలస్యం కావడం, చివరకు ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
Madras High Court | కొంత ఊరట..
ఈ కేసుపై వాదనలు పూర్తయిన అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది. ‘జన నాయగన్’ (Jana Nayagan) చిత్రానికి థియేట్రికల్ విడుదల కోసం UA16+ సర్టిఫికెట్ మంజూరు చేయాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపాలన్న సీబీఎఫ్సీ చైర్పర్సన్ నిర్ణయాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇప్పటికే బోర్డు సూచించిన మార్పులు, కట్స్ అన్నింటినీ అమలు చేసిన తర్వాత కూడా జాప్యం చేయడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) తరఫున వాదించిన న్యాయవాదులు డిసెంబర్ 18న సినిమాను సెన్సార్‌కు సమర్పించిన తర్వాత బోర్డు సూచించిన 27 మార్పులను పూర్తిగా అమలు చేసి మళ్లీ పంపామని, అయినప్పటికీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్ల విడుదలపై ప్రభావం పడిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
మరోవైపు సీబీఎఫ్సీ తరఫు న్యాయవాదులు, కమిటీ సభ్యుల్లో ఒకరు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో చైర్పర్సన్ తమ అధికారాలను వినియోగించి రివైజింగ్ కమిటీకి పంపారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు మెజారిటీ సభ్యుల నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తూ, సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయ్ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో దీనిని “విజయ్ విక్టరీ”గా పేర్కొంటూ సంబరాలు చేస్తున్నారు.అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసినట్లుగా లేదు. సింగిల్ జడ్జి తీర్పుపై సీబీఎఫ్సీ అదనపు సొలిసిటర్ జనరల్ అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.