అక్షరటుడే, వెబ్‌డెస్క్: Thalapathy Vijay | దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జననాయగన్’ (Jana Nayagan) ఆడియో లాంచ్ ఈవెంట్ మలేషియాలో అంగరంగ వైభవంగా జరిగింది. కౌలాలంపూర్‌లోని ప్రతిష్టాత్మక బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ వేడుక, కేవలం సినిమా ఈవెంట్‌కే పరిమితం కాకుండా ఒక అంతర్జాతీయ పండుగను తలపించింది.
విజయ్ (Thalapathy Vijay) సినీ కెరీర్‌కు ఇది వీడ్కోలు చిత్రం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు భారీగా తరలివచ్చారు.దాదాపు 80 వేల మందికి పైగా అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. సరిహద్దులు దాటి విస్తరించిన విజయ్ క్రేజ్‌ను చూసి అంతర్జాతీయ మీడియా సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన లైవ్ పెర్ఫార్మెన్స్తో స్టేడియాన్ని ఊపేయగా, అనూహ్యంగా విజయ్ వేదికపైకి వచ్చి డ్యాన్స్ చేయడంతో అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.
Thalapathy Vijay | డ్యాన్స్ అదరహో..
ఈ చిత్రంలోని పక్కా మాస్ సాంగ్ (Mass Song) ‘తలపతి కచేరీ’ కి విజయ్ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 51 ఏళ్ల వయసులో కూడా తన సిగ్నేచర్ గ్రేస్, ఎనర్జీతో చేసిన డ్యాన్స్ వీడియోలు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. తన ఆఖరి సినిమాలో అభిమానులకు మర్చిపోలేని ట్రీట్ ఇవ్వబోతున్నారనే నమ్మకాన్ని ఈ డ్యాన్స్ మరింత బలపరిచింది. మలేషియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వేడుకలో రాజకీయ ప్రసంగాలకు అనుమతి లేకపోయినా, అభిమానులు భారీగా TVK (తమిళగ వెట్రి కళగం) జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. అయితే విజయ్ ఎంతో హుందాతనంతో వారిని వారిస్తూ, కేవలం సినిమాను మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. ఈ చర్యకు ఆయనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి.
ఈ గ్రాండ్ ఈవెంట్లో సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్లు అట్లీ (Atlee), లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్‌తో పాటు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా (Prabhudeva) కూడా పాల్గొన్నారు. విజయ్‌తో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటూ, ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జననాయగన్’ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ అభిమానులకు ఇది ఒక సినిమా మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ ఫేర్‌వెల్‌గా మారనుందని ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ స్పష్టంగా చూపించింది.
ONE LAST DANCE. pic.twitter.com/kqYwM4yFA5
— LetsCinema (@letscinema) December 27, 2025