అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఆమె నవ్వుతూ తమ్ముడి పుట్టినరోజు వేడుకలు జరిపించింది.. కుటుంబ సభ్యులందరితో కలిసి కేక్ కట్ చేసింది.. కానీ అంతలోనే ఆ ఇంటిని తీరని విషాదం కమ్మేసింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన విహారిక (20) అనే బీటెక్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి ముందు పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ (Sarurnagar) పరిధిలో చోటుచేసుకుంది.
Hyderabad | షాకింగ్ నిర్ణయం..
సరూర్‌నగర్ స్వామిరెడ్డి నగర్ (Swamireddy Nagar)కు చెందిన అశోక్–రూప దంపతుల కుమార్తె విహారిక బీటెక్ చదువుతోంది. ఆమెకు కిషోర్ (32) అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు మొదట పెళ్లికి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా కిషోర్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, విహారికను దూరం పెట్టడంతో పాటు పెళ్లికి కూడా నిరాకరించడం మొదలుపెట్టాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురైన విహారిక గత వారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తిరుపతి (Tirupati)లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆమెను అక్కడ నుంచి తీసుకొచ్చి కుటుంబానికి అప్పగించారు.
ఆదివారం రాత్రి విహారిక ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ్ముడి పుట్టినరోజు కావడంతో అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపింది. అర్ధరాత్రి తమ్ముడితో కలిసి కేక్ కట్ చేసి అందరితో నవ్వుతూ మాట్లాడింది. అయితే ఆ సంతోషం వెనుక దాగి ఉన్న విషాదాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లిన విహారిక, వాట్సాప్‌లో ఒక స్టేటస్ (WhatsApp Status) పెట్టి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘‘సారీ మై బాయ్.. నీకు కావాల్సిన సంతోషాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను.. ఇదే నా చివరి మెసేజ్’’ అంటూ ఆమె పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు పోలీసుల విచారణలో కీలక ఆధారంగా మారింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు (Meerpet Police) కేసు నమోదు చేశారు.