అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills by-Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గడువు సమీపిస్తుండడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచారానికి మరో రెండ్రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశాయి. ర్యాలీలు, రోడ్‌షోలతో పాటు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి.
ఈ సందర్భంగా ముఖ్యనేతలు సవాళ్లు ప్రతిసవాళ్లతో స్టేట్ పాలిటిక్స్ (State Politics) రసవత్తరంగా మారాయి. నవంబర్ 11న జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election)లో 58 మంది పోటీ పడుతుండగా, మూడు పార్టీల మధ్యే ప్రధాన పోరు నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తేనే తర్వాత జరుగనున్న కీలకమైన స్థానిక, పుర పోరులో సత్తా చాటే అవకాశం ఉండడంతో మూడు పార్టీలూ ముమ్మరంగా పోరాడుతున్నాయి. ప్రధానంగా అత్యధికంగా ఓటర్లు నివాసమున్న బస్తీలపై ఫోకస్ చేశాయి. బీసీ, మైనార్టీ వర్గాల ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
Jubilee Hills by-Election | బస్తీలే కీలకం..
సంపన్న వర్గాల కేంద్రంగా చెప్పుకునే జూబ్లీహిల్స్ నియోజకవర్గ (Jubilee Hills Constituency) పరిధిలో మెజార్టీ ప్రజలు పేద, మధ్యతరగతికి చెందిన వారే ఉన్నారు. ఇక్కడి బస్తీలు, కాలనీలు, మురికివాడల్లో ఉంటున్న ప్రజలే ఎక్కువ. నియోజకవర్గంలో మొత్తం 4.01 లక్షల ఓటర్లు ఉండగా, అత్యధికంగా ఆయా వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. బోరబండ, రహమత్‌నగర్, షేక్‌పేట వంటి డివిజన్లలో మైనార్టీలు, ఇతర పేద వర్గాలకు చెందిన వారు అత్యధికంగా నివాసముంటున్నారు. వారు ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీ విజేత కావడం ఖాయం. అందుకోసమే ప్రధాన పార్టీలు పేదలు నివాసముండే బస్తీలు, కాలనీలు, మురికివాడలపై దృష్టి సారించాయి. ఒక్కో వార్డుకు కనీసం పది నుంచి వంద మంది వరకు నేతలు, కార్యకర్తలను మోహరించాయి. ప్రతి ఇంటికీ ఉదయం, సాయంత్రం రెండుసార్లు వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. ఇక ర్యాలీలు, రోడ్ షోలతో హల్ చల్ చేస్తున్నాయి.
Jubilee Hills by-Election | సవాళ్లు.. ప్రతి సవాళ్లు..
పార్టీల గెలుపు బాధ్యతలు మోస్తున్న ప్రధాన నాయకులు జూబ్లీహిల్స్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోడ్‌షోలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య ప్రధానంగా సవాళ్ల పర్వం నడుస్తోంది. అభివృద్ధి, అవినీతి, కేసుల విచారణ తదితర విషయాలపై ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటుండడం రసవత్తరంగా మారింది. బీఆర్ ఎస్ (BRS), బీజేపీ (BJP) ఒక్కటేనని, కాళేశ్వరం, ఈ కార్ రేస్ వంటి దర్యాప్తులను కేంద్రానికి అప్పగిస్తే కనీసం అడుగు ముందుకు పడడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఉప ఎన్నికజరిగేలోపు కేటీఆర్, హరీశ్‌రావును అరెస్టు చేయాలని సవాలు విసిరారు. గత మున్సిపల్ మంత్రి చెత్తగాడని, అందుకే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం విమర్శలను తిప్పకొట్టిన కేటీఆర్.. దమ్ముంటే అబివృద్దిపై సవాల్ విసిరారు. ప్రభుత్వం పెట్టినవన్నీ లొట్టపీసు కేసులని, తాము తప్పు చేసి ఉంటే రేవంత్‌రెడ్డి ఇలా వదిలేవాడా? అని ప్రశ్నించారు. ఇలా ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటుండడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
