అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్(Gandhi Bhavan)లో మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్‌లో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే మంచి మెజారిటీతో తమ అభ్యర్థి గెలుస్తారని మహేశ్ గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) సైతం కాంగ్రెస్ విజయకేతనం ఎగుర వేస్తుందన్నారు.
PCC Chief Mahesh Goud | అప్పుల పాలు చేసిన కేసీఆర్
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని మహేశ్‌గౌడ్(PCC Chief Mahesh Goud) విమర్శించారు. రాష్ట్రాన్ని బాకీల మయం చేసిన బీఆర్ఎస్ బాకీ కార్డులు పంపిణీ చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు బాకీ కార్డులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పీసీసీ అధ్యక్షుడు స్పందించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చారన్నారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
PCC Chief Mahesh Goud | హామీలు అమలు చేస్తున్నాం
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy Government) హామీలు అమలు చేస్తోందని మహేశ్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్–1 ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం బాకీ పడినట్లా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలని ఆయన అన్నారు.