అక్షరటుడే, కామారెడ్డి: Venkat Ramana Reddy Warning | తనపై ఈగ వాలినా సీఎందే బాధ్యత అని.. తనను తన కుటుంబాన్ని అవినీతి కుటుంబంగా చిత్రీకరించేలా చేస్తున్న షబ్బీర్ అలీని (Shabbir Ali) సీఎం రేవంత్‌రెడ్డి కంట్రోల్ చేయాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి (Mla KVR) పేర్కొన్నారు. లేదంటే తనకు ఏమి జరిగినా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వానిదే బాధ్యత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
Venkat Ramana Reddy Warning | ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో..
గత రెండేళ్లుగా ప్రశాంతంగా ఉన్న కామారెడ్డిలో(Kamareddy) అల్లకల్లోలం (Political Controversy) సృష్టించడానికి కాంగ్రెస్ నాయకులు యత్నించారని ఆరోపించారు. అధికారం ఉందని, అహంకారంతో ప్రభుత్వ సలహాదారు పదవి వచ్చాక షబ్బీర్ అలీ ఇన్‌ఛార్జి మంత్రులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను చేసిన ప్రతిపాదనలతో వచ్చిన నిధులను ఆయనే తెచ్చినట్టుగా శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. తాను అవినీతి కింగ్ అని, కౌన్సిలర్ టికెట్ ఆయనే ఇచ్చాడని, జడ్పీటీసీ టికెట్ ఇచ్చి చేశానని షబ్బీర్ అలీ చెప్పుకోవడాన్ని ఖండించారు. టికెట్ ఇవ్వడానికి ఆయనెవరని ప్రశ్నించారు. కౌన్సిలర్‌గా తనకు మద్దతివ్వాల్సింది పోయి నాపై పోటీ చేసిన వ్యక్తిని గెలిపించి ఓటమికి కారణమైంది షబ్బీర్ అలీనే అని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం కామారెడ్డి తన జాగీరు అన్నట్టుగా షబ్బీర్ అలీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఆధిపత్యం కోసం ప్రయత్నం
సీఎం రేవంత్ రెడ్డి ఓటమి పాలైన కామారెడ్డిలో షబ్బీర్ అలీ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కేవీఆర్ తెలిపారు. షబ్బీర్ అలీ వల్లే తాను కాంగ్రెస్(Congress Party) నుంచి బయటకు వచ్చానని, వైఎస్ఆర్ మరణం తర్వాత అనేక మంది నాయకులను షబ్బీర్ అలీ ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. షబ్బీర్ అలీని కాదని ఏ నాయకుడు కూడా రాష్ట్రస్థాయి నాయకుడిగా (Telangana Politics) ఎదగలేదని, ఇటీవల గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే రాష్ట్ర నాయకుడయ్యారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో నాలుగు కార్పొరేషన్ పదవులు, బాన్సువాడకు కార్పొరేషన్ పదవి వస్తుందని, కామారెడ్డికి మాత్రం ఒక్క పదవి కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
నన్ను హత్య చేసేందుకు కుట్ర?
కళాశాల భూముల విషయంలో నిజానిజాలు తేల్చుకుందామని ఎన్ఎస్యూఐ సందీప్‌కు ఫోన్ చేసి అతని వద్ద ఉన్న ఆధారాలతో ఒక్కడినే రమ్మని చెప్పానని ఎమ్మెల్యే తెలిపారు. తాను కూడా ఒక్కడినే వచ్చి మీడియా, అధికారుల సమక్షంలో తన తప్పు ఉంటే చెప్పుతో కొట్టాలని చెప్పానని తెలిపారు. సందీప్ మాత్రం భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారని, ఫలితంగా తనను చంపడానికి ప్రయత్నించారని భావించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అరాచకాలు, ఆగడాలను అడ్డుకున్నందుకు ఇదంతా చేస్తున్నట్టు అర్థమైందన్నారు.
ఎస్పీ సూచన మేరకే..
బాన్సువాడ ఘటనతో అక్కడ అల్లర్లు ఆగేలా చూడాలని జిల్లా ఎస్పీ తనకు ఫోన్ చేసి అడిగితే రాత్రి 12 గంటల లోపు అక్కడ పరిస్థితి సద్దుమణిగేలా మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. శిశుమందిర్‌కు వేలాదిగా తరలిరావాలని కాంగ్రెస్ పెట్టిన మెసెజ్‌తో ఇప్పటికే బాన్సువాడ సమస్య ఉందని, కామారెడ్డిలో లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లవద్దని ఎస్పీ కోరడంతో తాను ఇంట్లోనే ఉన్నట్టు తెలిపారు. కళాశాల భూములపై రాజకీయం చేస్తున్నారని, తన కుటుంబం అవినీతిమయమని చెప్పుకునేలా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు చెందిన 263 ఎకరాలలో ఒక్క గజం భూమి అయినా తాము అమ్ముకున్నట్టు నిరూపించాలన్నారు. అలా చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ఉదయమే ఒక్కడినే బయటకు వెళదామని చూడగా ఇంటిముందు పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. దాంతో తాను ఇంట్లో దొంగలా దాక్కున్నానని ప్రచారం చేస్తున్నారన్నారు. షబ్బీర్ అలీ కొడుకు రేప్ కేసు నుంచి మొదలుపెడితే అన్ని విషయాలు మాట్లాడతా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గ్రామాలకు వెళ్తా..
రేపటి నుంచి తాను గ్రామాల్లోకి వెళతానని, తనపై ఈగ వాలినా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని కేవీఆర్ అన్నారు. ఇప్పుడు కారు మాత్రమే బోల్తా పడిందని, ఇక కామారెడ్డి నుంచే ప్రభుత్వ పతనం మొదలవుతుందన్నారు. సీఎం ఇక్కడ ఓటమి చెందినా కామారెడ్డికి వస్తే సీఎంగా తాను గౌరవించి స్వాగతం పలుకుతానన్నారు. 9సార్లు టికెట్ వస్తే ఏడు సార్లు ఓడిపోయి గత ఏడాదిలో రూ.100 కోట్లు సంపాదించిన వ్యక్తిని కామారెడ్డి మీద వదులుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇక సీఎంతోనే యుద్ధం అనుకుంటానన్నారు. సీఎంఆర్ఎఫ్ గురించి సీఎంతో మాట్లాడినప్పుడు షబ్బీర్ అలీ గురించి చెప్పానని అయినా సీఎం పట్టించుకోలేదన్నారు. కళాశాలకు సంబంధించిన సొసైటీలో రాజకీయ నాయకులు సభ్యులుగా అయ్యేందుకు ప్రయత్నించారని, చివరికి షబ్బీర్ అలీ కూడా ప్రయత్నించారన్నారు. అయితే కమిటీ మెంబర్లు రాజకీయ నాయకులు వచ్చేందుకు ఒప్పుకోలేదన్నారు. దాంతో సొసైటీని ప్రభుత్వానికి అప్పగించేలా గొడవలు చేశారన్నారు. కళాశాల ఆస్తుల అన్యాక్రాంతంపై డాక్యుమెంట్లు తీసుకుని వచ్చి మాట్లాడాలన్నారు.
సోమవారం కలెక్టర్ వద్ద తేల్చుకుందాం
సోమవారం కలెక్టర్ ఛాంబర్‌కు తాను వస్తానని, రెవెన్యూ రికార్డులు అన్ని కలెక్టర్ వద్దే ఉంటాయని, షబ్బీర్ అలీకి దమ్ముంటే కలెక్టర్ వద్దే తేల్చుకుందాం రావాలని మరోసారి సవాల్ చేశారు. షబ్బీర్ అలీ నిజాయితీ గల నాయకుడే అయితే రావాలన్నారు. కలెక్టర్ వద్ద తాను ఏమి మాట్లాడనని, తన తప్పు ఉందని చూపిస్తే అక్కడే స్పీకర్‌తో మాట్లాడి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్, రెవెన్యూ అధికారులను తన వద్దకు పిలిపించుకోవాలని, అక్కడే తప్పు ఎవరిదో తేల్చుకుందామన్నారు. కళాశాల భూముల విషయంలో తన కుటుంబ సభ్యులు, తన తప్పు ఉందని తేలితే సీఎంకు రాజీనామా లేఖ ఇస్తానని పేర్కొన్నారు. షబ్బీర్ అలీది తప్పని తేలితే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే తన సమాధానం వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు.