అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)లో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమవగా, విజిలెన్స్ అధికారులు కీలక అంశాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు.
ఇప్పటికే తిరుమల వెంకన్న సన్నిధిలో లడ్డూ కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా తిరుపతి లోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ విమాన గోపురం పనుల్లోనూ అవినీతి జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంలో సుమారు 50 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతైన విచారణ చేపట్టింది. అంతేకాకుండా, విమాన గోపురంపై ఉన్న సుమారు 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
Tirumala | అవినీతి మరకలు..
అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple)లో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022–23 మధ్యకాలంలో జరిగాయి. ఈ పనుల కోసం టీటీడీ మొత్తం 100 కిలోల బంగారాన్ని కేటాయించినట్లు రికార్డులు చెబుతున్నాయి. గోపురానికి తొమ్మిది పొరలతో బంగారు తాపడం చేయాల్సి ఉండగా, వాస్తవానికి కేవలం రెండు పొరలతోనే పనులు పూర్తి చేసి, దాదాపు సగం బంగారాన్ని( Gold) మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రక్రియలో విమాన గోపురంపై ఉన్న 30 విగ్రహాలను ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం చేసినట్లు కూడా ఫిర్యాదులు అందాయి.
ఈ అంశాలు బయటకు రాకుండా నాటి టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి (TTD Chairman Y.V. Subba Reddy), ఈవో ధర్మారెడ్డి (EO Dharma Reddy) కప్పిపుచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్కు కాకుండా సబ్ లీజు కింద మరో ఇద్దరికి పనులు అప్పగించినట్లు దేవస్థాన అధికారులకు అప్పట్లోనే ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో వాటిపై సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అన్ని అంశాలపై టీటీడీ విజిలెన్స్ (TTD Vigilance) అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరిస్తున్న అధికారులు, బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారిస్తున్నారు. ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు? నిజంగా ఎంత బంగారం వినియోగించారు? మిగిలిన బంగారం ఎక్కడికి వెళ్లింది? అనే కీలక ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు.