అక్షరటుడే, వెబ్డెస్క్: Venezuela Attack | అగ్రరాజ్యం అమెరికా తీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెనిజులాపై (Venezuela) దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని నికోలస్ మధురోను యూఎస్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
వెనిజులా నుంచి అమెరికాలో (America) మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతున్నాయని ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ దేశంపై దాడి చేస్తామని ప్రకటించిన ఆయన అన్నంత పని చేశారు. శనివారం వెనిజులాపై వైమానిక దాడులు చేశారు. అంతేగాకుందా ఆ దేశ అధ్యక్షుడు మధురోతోపాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు. అమెరికా దాడులను రష్యా (Russia), చైనా (China), ఇరాన్ (Iran) వంటి దేశాలు ఖండించాయి.
Venezuela Attack | సాయుధ దురాక్రమణ
రష్యా విదేశాంగ శాఖ అమెరికా దాడులను (US attacks) సాయుధ దురాక్రమణగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలను అగ్రరాజ్యం బహిరంగంగా ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేసింది. చైనా సైతం ఈ దాడులను ఖండించింది. వెనిజులా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పేర్కొంది. ఇరాన్ సైతం ఈ దాడులను రాజ్య ఉగ్రవాదంగా పేర్కొంది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రపంచ శాంతికి విఘాతమని హెచ్చరించింది. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డయాజ్-కానెల్ సైతం ఇది లాటిన్ అమెరికాపై జరిగిన దాడి అన్నారు.
ఈ ఘటనపై అత్యవసర చర్చ జరపాలని వెనిజులా విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య సమితిని విజ్ఞప్తి చేశారు. బ్రెజిల్, కొలంబియా కూడా ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాయి. అమెరికా మాత్రం తన చర్యలను సమర్థించుకుంది. వెనిజులా నుంచి తమ దేశంలోకి సాగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని స్పష్టం చేసింది. నికోలస్ మదురోను పట్టుకోవడం ద్వారా నియంత పాలనకు ముగింపు పలికామని ట్రంప్ ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం.