అక్షరటుడే, భీమ్‌గల్ : Vemula Prashanth Reddy Protest | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి (MLA Vemula Prashanth Reddy) అన్నారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గతంలో వేల్పూర్ (Velpuru) వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంబంధించి 32 మంది బీఆర్ఎస్ (BRS) నాయకులు, రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిని ఆయన ఖండించారు. ఈ మేరకు ఆదివారం వేల్పూర్ పోలీస్ స్టేషన్‌కు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లిన ఆయన, పోలీసుల నుంచి నోటీసులు స్వీకరించారు. అంతకుముందు నల్ల దుస్తులు ధరించి, నల్ల జెండాలతో ప్రభుత్వ తీరుకు వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ నిరసన చేపట్టారు.
Vemula Prashanth Reddy Protest | చట్టం రేవంత్ రెడ్డికి చుట్టమా?
వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) రాజ్‌భవన్ (Raj Bhavan) ముందు రోడ్డుపై కూర్చుని ధర్నా చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. అనుమతి తీసుకుని శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చట్టం అనేది అధికార పక్షానికి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా ఉంటుందా అని డీజీపీ (Dgp)ని నిలదీశారు. అక్రమ కేసులతో తమ గొంతు నొక్కలేరని, అణచివేసే కొద్దీ స్ప్రింగ్‌లా పైకి లేచి ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
Vemula Prashanth Reddy Protest | హామీలు అమలు చేయాలి
రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని వేముల విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో 53 వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉండగా, కేవలం 22 వేల మందికే చేసి మిగిలిన వారిని మోసం చేశారన్నారు. యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారని, యాప్‌ల పేరుతో రైతులను వేధించడం మానుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా జైల్లో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
