అక్షరటుడే, వెబ్డెస్క్ : Vehicle Sales | దసరా, దీపావళి పండుగల సీజన్‌లో కొత్త వాహనాలు కొనడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తుంటారు. దీంతో వాహనాల విక్రయాలు ఎక్కువగా ఉంటాయి.
ఈసారి జీఎస్టీ (GST) రేట్లను తగ్గించడంతో విక్రయాలు మరింత పెరిగాయి. మారుతి సుజుకీ, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, కియా మోటార్స్ కంపెనీల విక్రయాల్లో రెండంకెల వృద్ధి కనిపించింంది. స్కోడా ఆటో, టయోటా కిర్లోస్కర్ మోటార్లు సైతం గణనీయంగానే తమ వాహనాలను విక్రయించాయి.
Vehicle Sales | మారుతీనే లీడర్..
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ (Maruti Suzuki) ఇండియా అక్టోబర్‌లో 1,80,675 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో అమ్ముడైన 1,63,130 వాహనాలను అమ్మింది. అంటే గతేడాదితో పోల్చితే విక్రయాల్లో సుమారు 11 శాతం వృద్ధి నమోదయ్యింది. విదేశాలకు చేసిన ఎగుమతులు (31,304), ఇతర సంస్థలకు అమ్మకాలు(8,915) కలిపి మొత్తం విక్రయాలు 2,20,894 యూనిట్లుగా నమోదయ్యాయి. నవరాత్రుల ప్రారంభం నుంచి పండుగ సీజన్ 40 రోజుల్లో 5 లక్షల బుకింగ్స్ (Bookings) రాగా 4.1 లక్షల రిటైల్ వాహనాలను విక్రయించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Vehicle Sales | రికార్డు స్థాయిలో ఎంఅండ్‌ఎం విక్రయాలు..
మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) దేశీయంగా గతేడాది అక్టోబర్‌లో అమ్మకాలు 54,504 యూనిట్లను విక్రయించగా.. ఈసారి రికార్డు స్థాయిలో 71,624 ఎస్‌యూవీలను (SUV) విక్రయించింది. అంతే గతేడాదితో పోల్చితే ఇది 31 శాతం అధికం. ఎస్‌యూవీలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్ముడవడం ఇదే తొలిసారి అని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
Vehicle Sales | టాటా కార్ల అమ్మకాలలో 26 శాతం వృద్ధి..
గతనెలలో టాటా ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్(Tata Passenger Vehicles Ltd.) 61,295 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 48,423 యూనిట్లతో పోలిస్తే విక్రయాల్లో 26.6 శాతం వృద్ధి కనిపించింది. ఇందులో 47 వేల యూనిట్ల ఎస్‌యూవీలు, 9,286 ఎలక్ట్రిక్ వాహనాలు(EV) ఉన్నాయి. కాగా నవరాత్రి నుంచి దీపావళి వరకు లక్ష వాహనాలను డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది.
Vehicle Sales | హ్యుందాయ్, కియా, టయోటా, స్కోడా..
హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా గతనెలలో 69,894 వాహనాలను అమ్మింది. 53,792 యూనిట్లను దేశీయంగా విక్రయించగా.. 16,102 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది అక్టోబర్‌లో 53,792 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గతేడాదికంటే సుమారు 30 శాతం అధికంగా ఈసారి హ్యుందాయ్ కార్లు అమ్ముడయ్యాయన్న మాట. అయితే దేశీయ విక్రయాలు మాత్రం 3 శాతం క్షీణించి 55,568 నుంచి 53,792 యూనిట్లకు తగ్గడం గమనార్హం.
- కియా (Kia) ఇండియా గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధితో 29,556 పాసింజర్ వాహనాలను విక్రయించింది. సోనెట్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ, సెల్టోస్ మెరుగైన విక్రయాలకు దోహదపడ్డాయి.
- టయోటా(Toyota) కిర్లోస్కర్ మోటార్ 40,257 వాహనాలను దేశీయంగా విక్రయించింది. 2,635 యూనిట్లను ఎగుమతి చేసింది.
- స్కోడా(Skoda) ఆటో ఇండియా 8,252 యానిట్లను విక్రయించింది.
