అక్షరటుడే, హైదరాబాద్: VBGRAMG | గ్రామీణ ప్రాంత నిరుపేదల ఉపాధి హామీకి ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (గ్రామీన్) వీబీ-జి రామ్ జీ చట్టం 2025’ తీవ్ర విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ చట్టాన్ని తిరిస్కరించి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
VBGRAMG చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి పాల్గొని తీర్మానానికి మద్దతు తెలియజేస్తూ వీబీ-జి రామ్ జీ చట్టం వల్ల కలిగే నష్టాలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజల తరఫున వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) యథాతథంగా అమలు చేయాలని శాసనసభ ద్వారా డిమాండ్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని కోరారు.
VBGRAMG | ఉపాధి హామీ ఆత్మను దెబ్బతీసేలా..
“వికసిత్ బారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ పేదల హక్కులను దెబ్బతీసే విధంగా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల మహిళల ఉపాధికి హామీ లేకుండా చేస్తుంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే విధంగా కొత్త నిబంధనలు పేదల పట్ల శాపంగా మారనున్నాయి.
పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రమ దోపిడీ, వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల కోసం 2006 ఫిబ్రవరి 2 వ తేదీన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం ద్వారా కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారెంటీ పథకమిది. గడిచిన 20 ఏళ్లలో ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిన వారిలో రాష్ట్రంలో 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలున్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్ది పొందారు.
కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం అసలు ఉద్దేశం దెబ్బతీసేలా ఉంది. డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళిక తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి. కొత్త చట్టం మహిళల కూలీలకు వ్యతిరేకంగా ఉంది.
కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల పని దినాల వల్ల పేదలకు పని దినాలు తగ్గిపోతాయి. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం కొనసాగించాలి. పాత చట్టంలో వంద శాతం కేంద్రం నిధులు అందిస్తుండగా, కొత్త చట్టంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న నిబంధన సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. రాష్ట్రాలపై అదనపు భారం మోపుతోంది.
మహాత్మా గాంధీ పేరును తొలగించడం గాంధీ స్ఫూర్తిని నీరుగార్చినట్టయింది. మహాత్మాగాంధీ పేరును పునరుద్ధరించాలని సభ డిమాండ్ చేస్తోంది.
ప్రస్తుత ఉపాధి హామీ పథకం ద్వారా 266 పనులు చేసే అవకాశం ఉంది. కొత్త చట్టంలో భూమి అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడంతో చిన్న, సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథావిధంగా కొనసాగించాలి.
వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం విధించడంతో భూమిలేని కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో మొట్టమొదటగా అనంతపురం జిల్లా బండపల్లిలో ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో అమలు చేశారు. పని కల్పించడం ఒక హక్కుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పని దొరక్క వలసలు వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. పాలమూరు వలసల గురించి అందరికీ తెలిసిందే.
కేంద్రం తెచ్చిన చట్టం వల్ల మళ్లీ పట్టణాలకు వలసలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని, MGNREGA లో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మగాంధీ NREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానిస్తుంది..” అని ముఖ్యమంత్రి వివరించారు.