అక్షరటుడే, వెబ్డెస్క్: USFI మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల Government Junior College లో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ భావాజాలానికి ఆకర్షితులైన విద్యార్థులు సదరు విద్యార్థి సంఘంలో చేరారు. యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా Medchal Malkajgiri District కార్యదర్శి బ్యాగారి వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
USFI | బకాయిలను విడుదల చేయాలి..
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పదేళ్ల నుంచి స్కాలర్షిప్స్, రీయెంబర్స్మెంట్ బకాయిలు రూ. 8000 కోట్లు పేరుకుపోయాయని తెలిపారు. ఫలితంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవ్వాల్సిన దుస్థితి కొనసాగుతోందని వాపోయారు. పెండింగులో ఉన్న స్కాలర్షిప్స్, రీయెంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యారంగంపై ప్రభుత్వం మరింత కేంద్రీకరించాలన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలలో రూ. లక్షల్లో ఫీజులు పెంచుతూ పోవడం వల్ల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం చట్టం చేయాలని వెంకటేష్ డిమాండ్ చేశారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి యూఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతోందని వెంకటేష్ తెలిపారు. భవిష్యత్తులో నూతన నాయకత్వంతో మరిన్ని పోరాటాలు చేస్తామని, మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన లక్ష్యంగా బలమైన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో కిరణ్, ప్రసాద్, సాయిప్రసాద్, బన్నీ, వినయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.