అక్షరటుడే, వెబ్‌డెస్క్: USA Team Tirumala Visit | టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) పోటీల కోసం భారత్‌కు విచ్చేసిన అమెరికా ఆటగాళ్లు శుక్రవారం తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy)వారిని దర్శించుకున్నారు. జట్టులోని భారత సంతతి ప్లేయర్లు ఆలయంలో ప్రత్యేక సేవల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగిందని, ఆలయ ప్రాంగణం తనను ఆకట్టుకుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, బీసీసీఐ ,ఆంధ్ర క్రికెట్ సోసియేషన్ (Andhra Cricket Association)కు కృతజ్ఞతలు తెలిపారు.
USA Team Tirumala Visit | జట్టులో భారత సంతతి ఆటగాళ్లు..
అమెరికా జట్టులో తెలుగు మూలాలున్న సాయితేజ కూడా ఉండటం విశేషం. ఆయన తండ్రి నాగేశ్వర్ రెడ్డి నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కమలాపురి గ్రామానికి (Kamalapuri Village) చెందినవారు. ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడడంతో సాయితేజ అక్కడే పుట్టి పెరిగి ప్రస్తుతం జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. అదేవిధంగా ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్, మహారాష్ట్రకు చెందిన శుభమ్ రంజా, గుజరాత్‌కు చెందిన మోనాంక్ పటేల్, ముంబైకి చెందిన హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, కర్ణాటక మూలాలున్న సంజయ్ కృష్ణమూర్తి వంటి భారత సంతతి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
ఇక తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుండగా, దివ్యదర్శనం మరియు సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటల వరకు సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. సోమవారం మొత్తం 73,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 23,291 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.42 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.