అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump Mobiles : ట్రంప్ (Trump) ఈ పేరే ఓ సంచలనం. అమెరికా అధ్యక్షుడిగా తన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా తన కుమారులు నిర్వహిస్తున్న కంపెనీ మొబైల్ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. ట్రంప్ బ్రాండ్ పేరుతో స్మార్ట్ ఫోన్ల(Smart phones)ను తయారు చేశారు. వీటిని సోమవారం ఆవిష్కరించారు.
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ జూనియర్ ట్రంప్ కలిసి ట్రంప్ ఆర్గనైజేషన్(Trump organisation) నిర్వహిస్తున్నారు. వీరు ట్రంప్ బ్రాండ్ పేరుతో టెలికాం రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా సోమవారం ‘ట్రంప్ మొబైల్’ పేరుతో కొత్త మొబైల్ సేవ, 499 డాలర్ల ధరతో గోల్డ్ కలర్ T1 అనే స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించారు. ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఫోన్‌ను పూర్తిగా అమెరికాలో తయారు చేయనున్నట్లు ట్రంప్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ఫోన్ ఫీచర్స్ తెలుసుకుందామా..
Trump Mobiles : మొబైల్ ఫోన్ వివరాలు..
ఇప్పటివరకు వెల్లడించిన వివరాల ప్రకారం ట్రంప్ మొబైల్ T1 ధర 499 డాలర్లుగా నిర్ణయించారు. ఇది 6.8 inches అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.
మొబైల్ సేవ ప్లాన్: నెలవారీ 47.45 డాలర్ల ధరతో ‘47 ప్లాన్’ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్(Unlimited calling), 5జీ డాటా, టెక్స్ట్, టెలి హెల్త్, ఫార్మసీ బెనిఫిట్స్ వంటి సేవలు అందనున్నాయి. అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. ప్రస్తుతం 47వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. దీనికి గుర్తుగా ఈ ప్లాన్ తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. AT&T, వెరిజోన్, టీ మొబైల్ వంటి ప్రధాన టెలికాం సంస్థలకు పోటీగా ఉండాలని ట్రంప్ ఆర్గనైజేషన్ భావిస్తోంది. కన్సర్వేటివ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ తీసుకువచ్చారు.
Trump Mobiles : మేడిన్ అమెరికా.. సాధ్యమేనా!?
ట్రంప్ కంపెనీ మేడిన్ అమెరికా(Made in America)పై దృష్టి సారించింది. మొబైల్స్‌ను అమెరికాలోనే తయారు చేయించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది సాధ్యమయ్యే పని కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అమెరికాలో స్మార్ట్‌ఫోన్ తయారీ సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. యూఎస్‌లో 499 డాలర్ల ధరలో ఫోన్ తయారు చేయడం అసాధ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.
