అక్షరటుడే, వెబ్‌డెస్క్ : USDeportation | అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్ (Trump) కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అయితే స్వచ్ఛందంగా దేశం వీడే వారికి మరో ఆఫర్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇచ్చే ప్రోత్సాహకాలను మరింత పెంచింది.
అక్రమంగా నివసిస్తున్న వలసదారులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అంగీకరిస్తే.. వారికి 3వేల అమెరికన్ డాలర్లు (American Dollars) ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇది ఉచిత విమాన టికెట్‌తో పాటు అదనంగా ఇవ్వనున్నట్లు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ పేర్కొంది. ఈ ప్రత్యేకమైన ప్రోత్సాహకం ఈ ఏడాది చివరి మాత్రమే అమలులో ఉంటుందని ప్రకటించింది.
అక్రమ వలసల నిరోధంలో దృఢ నిశ్చయంతో ఉన్న ట్రంప్ యంత్రాంగం.. ఇప్పటికే వందలాది మందిని అదుపులోకి తీసుకుని నిర్బంధ శిబిరాలకు పంపిస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా తిరిగి వెళ్లే వారికి ప్రోత్సాహం కల్పించేందుకు గత మే నెలలో వెయ్యి డాలర్ల స్టైఫండ్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని ఇప్పుడు మూడు రెట్లు పెంచి 3వేల డాలర్లకు తీసుకొచ్చింది. ఈ సౌకర్యం కోసం సీబీపీ హోమ్ మొబైల్ యాప్ (CBP Home Mobile App) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారిని అదుపులోకి తీసుకోనవసరం లేదని.. బలవంతంగా బహిష్కరణ జాబితా నుంచి తొలగిస్తామని డీహెచ్ఎస్ అధికారులు స్పష్టం చేశారు. అంతేకాక, వారిపై ఉన్న సివిల్ జరిమానాలను కూడా మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని అక్రమ వలసదారులు అరెస్టు, బహిష్కరణకు గురవుతారని డీహెచ్ఎస్ హెచ్చరించింది. అలాంటి వారు భవిష్యత్తులో అమెరికాకు తిరిగి వచ్చేందుకు అవకాశం ఉండదని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department Of Homeland Security) స్పష్టంగా తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం వీడినట్లు సమాచారం. వీరిలో వేల మంది సీబీపీ హోం యాప్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లోనే లక్షల మందిని బహిష్కరించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.