అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Iran War Tensions | మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య అణు చర్చలపై ప్రతిష్టంభన నెలకొనడంతో అసహనానికి గురవుతున్న యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (US President Trump) భారీ దాడులకు ఆదేశాలిచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ఇరాన్ ప్రజలు వణికిపోతున్నారు.ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగంగా అభివృద్ధి చేస్తోందని, అధిక స్థాయి యురేనియం (Uranium) సంపుష్టీకరణ చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ (Israel) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం ఉందని భావిస్తోన్న ఇజ్రాయెల్, అమెరికా కలిసి గతేడాది ఇరాన్‌లోని అణు సౌకర్యాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ యుద్ధం 12 రోజులపాటు కొనసాగింది. ఇరాన్‌పై ఒత్తిడి పెంచడానికి ట్రంప్ కఠినమైన ఆంక్షలు సైతం విధించారు. దీంతో ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.
వివాదాస్పద అణు కార్యక్రమానికి ఇరాన్ చరమగీతం పాడాలన్న ప్రధాన డిమాండ్‌తో గతంలో జరిగిన తొలి దఫా పరోక్ష అణు చర్చలకు కొనసాగింపుగా జెనీవాలో ఇరాన్, అమెరికాల మధ్య ఇటీవల మరోదఫా చర్చలు జరిగాయి. పరోక్ష చర్చల్లో అమెరికా తరఫున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ (Minister Abbas Araghchi) పాల్గొన్నారు. అయితే చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు విఫలమైతే దాడులు చేసేందుకు వీలుగా ఇప్పటికే ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధవిమానాలు, నౌక దళాలను యూఎస్ మోహరించింది.
కాగా అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎసఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ’ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, ఈసారి యూఎస్ సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయమని ఆయన ట్రంప్‌ను హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా (America) త్వరలోనే భారీ దాడులకు దిగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ట్రంప్ విసిగిపోతున్నారు. యుద్ధానికి వెళ్లవద్దని ఆయన చుట్టూ ఉన్న కొందరు హెచ్చరిస్తున్నారు. కానీ మరికొన్ని వారాల్లోనే భారీ స్థాయి సైనిక చర్య ఉండే అవకాశాలు ఉన్నాయి’ అని అమెరికా అధ్యక్షుడి సలహాదారు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఏం జరగబోతుందోనని అందరూ ఆందోళనతో ఉన్నారు.