అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికా (America) రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతోంది. తాత్కాలిక నిధుల బిల్లుపై డెమోక్రాట్లు–రిపబ్లికన్ల మధ్య నెలకొన్న విభేదాలు షట్‌డౌన్ రూపంలో భారీ పరిణామాలను తెచ్చిపెట్టాయి. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది. అంచనాల ప్రకారం, ఈ షట్‌డౌన్‌తో అమెరికా జీడీపీ (GDP)కి వారానికి 15 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక నెల రోజులు ఈ పరిస్థితి కొనసాగితే కనీసం 43,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు. ఇప్పటికే సుమారు 7.5 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోతున్నారు. వీరికి జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది.
America | ఆరోగ్య బీమా సబ్సిడీపై రాజకీయం
వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని పలు ఫెడరల్ కార్యాలయాలు (Federal offices) మూతపడ్డాయి. ఇందులో 80 శాతం మంది ఉద్యోగులు వాషింగ్టన్ నగరానికి చెందినవారే కావడం గమనార్హం. ఈ సంక్షోభానికి కేంద్రబిందువుగా మారింది ఒబామాకేర్ ఆరోగ్య బీమా సబ్సిడీ. షట్‌డౌన్ నివారణకు కావలసిన తాత్కాలిక నిధుల బిల్లును ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు (Republicans) ఆమోదించగలిగినప్పటికీ, అదే బిల్లు సెనేట్‌లో 60 ఓట్ల మద్దతు లభించక విఫలమైంది. కారణం, డెమోక్రాట్లు బిల్లులో ఆరోగ్య బీమా సబ్సిడీలను కొనసాగించాలనుకుంటుండగా, ట్రంప్ మద్దతుతో ఉన్న రిపబ్లికన్లు దీనికి నిరసన తెలుపుతున్నారు. అఫర్డబుల్ కేర్ యాక్ట్ (ఒబామాకేర్) ద్వారా అందిస్తున్న ఆరోగ్య బీమా సబ్సిడీల కాలపరిమితి ముగియనుండటంతో కోట్లాది ప్రజలకు ఆరోగ్య భద్రతపై భయం మొదలైంది.
ఇదే విషయంపై డెమోక్రాట్లు రాజీపడటానికి సిద్దంగా లేకపోవడం, ట్రంప్ ప్రభుత్వం దీన్ని వలసదారులకు ప్రయోజనంగా అభివర్ణిస్తూ మద్దతు నిరాకరించడంతో సంక్షోభం తలెత్తింది. గతంలో జరిగిన షట్‌డౌన్‌ల సమయంలో స్టాక్ మార్కెట్లు (Stock Markets) తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇప్పటికీ అదే పరిస్థితి పునరావృతం కావచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిత్యవసర సేవల్లో విఘాతం ఏర్పడటంతో పాటు, వ్యాపార, పెట్టుబడి వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది అమెరికా చరిత్రలో 16వసారి చోటు చేసుకుంది. ఇదివరకూ ట్రంప్ (Trump) అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలోనే సుదీర్ఘమైన 35 రోజుల షట్‌డౌన్ జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆయన హయాంలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నేతలతో ప్రత్యేక సమావేశాలు జరిపినప్పటికీ అవి సక్సెస్ కాలేదు.

