అక్షరటుడే, వెబ్‌డెస్క్ : US Bangladesh Trade Deal | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి అధ్యక్షుడు అయ్యాక అన్ని దేశాలపై విధించినట్లుగానే బంగ్లాదేశ్‌పైనా రెసిప్రోకల్ టారిఫ్స్ (Reciprocal Tariffs) విధించారు. బంగ్లా నుంచి వచ్చే దిగుమతులపై 37 శాతం సుంకాలు అమలు చేశారు. కొంతకాలానికి ఈ టారిఫ్‌లను 20 శాతానికి కుదించారు.
వాణిజ్య ఒప్పందం విషయంలో ఆ దేశాల మధ్య చర్చలు కొనసాగుతూ వస్తున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో వస్త్ర పరిశ్రమ ఆధారిత ఆర్థికవ్యవస్థ అయిన బంగ్లాదేశ్‌లో కంగారు మొదలైంది. దీంతో దేశంలో ఎన్నికల వేళ భారత్ కంటే తక్కువ టారిఫ్‌లతో ఒప్పందం కుదుర్చుకొనేందుకు యత్నించింది. ఎట్టకేలకు ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చి ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఫిబ్రవరి 9న రెండు దేశాలు సంతకాలు చేశాయి. దీని ప్రకారం బంగ్లాదేశ్ ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాలు 20 శాతం నుంచి 19 శాతానికి తగ్గనున్నాయి.
US Bangladesh Trade Deal | ఇంతచేస్తే తగ్గింది ఒక్క శాతమే!
వ్రతం చెడ్డా ఫలం దక్కాలి అనేది సామెత. కానీ బంగ్లాదేశ్ విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కోసం బంగ్లాదేశ్ కొన్ని త్యాగాలకు సైతం సిద్ధపడింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ తయారు చేసే దుస్తుల్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న కాటన్ లేదా సింథటిక్ ఫైబర్ (Synthetic Fiber)ను ఉపయోగించడానికి అంగీకరించింది. అలాంటి ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో సున్నా సుంకం సదుపాయం కల్పించారు. బదులుగా బంగ్లాదేశ్ తన దేశీయ మార్కెట్‌ను అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, మెడికల్ పరికరాలు, ఆటోపార్టులు, ఇంధన ఉత్పత్తులకు తెరిచేందుకు అంగీకరించింది. ఇంత చేసినా భారత్‌పై విధించిన సుంకాలకన్నా బంగ్లాపై సుంకాలు ఎక్కువగా ఉండడం గమనార్హం. దీంతో అగ్రరాజ్యంతో ట్రేడ్ డీల్ కుదిరిందన్న ఆనందం బంగాదేశ్‌కు లేకుండా పోయింది. అయితే అమెరికా కాటన్ వాడితే లభించే ‘జీరో టారిఫ’ వెసులుబాటు ఒక్కటే ఆ దేశానికి ఊరటనిచ్చే అంశం.