అక్షరటుడే, వెబ్‌డెస్క్: US attack on Venezuela | చిన్నదేశమైన వెనిజులాపై అగ్ర రాజ్యం అమెరికా ఇటీవల చేపట్టిన సైనిక దాడి అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. యూఎస్ దాడి లాటిన్ అమెరికా పరిసర ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచింది. దేశాల సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.
US attack on Venezuela | ఎందుకు దాడి..
వెనిజులాలోని కీలక ప్రాంతాలపై జనవరి 3, 2026న అమెరికా వైమానిక దాడులు చేపట్టింది. వెనిజులా Venezuela అధ్యక్షుడు నికోలాస్ మడూరో Venezuelan President Nicolas Maduro ప్రభుత్వం మాదకద్రవ్య అక్రమ రవాణాకు పాల్పడుతోందనేది యూఎస్ ప్రధాన ఆరోపణ. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు కూడా పేర్కొంటోంది. దీనికితోడు వెనిజులా దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతిందని, ఎన్నికలు కూడా న్యాయంగా జరగలేదని పేర్కొంటూ.. అసలు మడూరో ప్రభుత్వాన్ని చాలా కాలంగా అమెరికా గుర్తించడంలేదు.
US attack on Venezuela | శత్రుత్వం ఎలా మొదలైంది..
అమెరికా–వెనిజులాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటివి కాదు. వెనిజులాలో 1999 సంవత్సరంలో హ్యూగో చావేజ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఉన్నాయి. చావేజ్ సామ్యవాద విధానాలు పాటించడం, అమెరికా వ్యతిరేక రాజకీయ దృక్పథం అవలంబించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
2013లో చావేజ్ మరణించారు. తర్వాత నికోలాస్ మడూరో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన కాలంలో ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. వెనిజులాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ నిల్వలపై అమెరికా కన్నేసింది. యూఎస్‌కు చమురు నిల్వలు పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. వెనిజులాను తన చెప్పు చేతల్లో ఉంచుకుంటే.. భవిష్యత్తులో ఆ దేశంలోని చమురు నిల్వలపై ఆజమాయిషీ చెలాయించ వచ్చనేది అగ్ర రాజ్యం పన్నాగంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే వెనిజులాపై అమెరికా దాడి చేసినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం పరిస్థితి..
యూఎస్ దాడులను వెనిజులా ప్రభుత్వం.. “సార్వభౌమ దేశంపై అక్రమ సైనిక దాడి” గా వర్ణించింది. ఈ దాడిని ఖండించింది. వెనిజులా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించుకుంది. అమెరికా మాత్రం ఇది భద్రతా కారణాల నేపథ్యంలో తీసుకున్న చర్యగా సమర్థించుకుంది. మొత్తానికి ఈ పరిణామాలతో లాటిన్ అమెరికా ప్రాంతంలో రాజకీయ అస్థిరత పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రపంచ దేశాల స్పందన
వెనిజులాపై అమెరికా దాడి చేయడంపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు యూఎస్ చర్యను తీవ్రంగా ఖండించాయి. ఈ పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి “తీవ్ర ఆందోళనకరమైనది”గా పేర్కొంది. హింసకు తావులేని పరిష్కారం అవసరమని హితవు పలికింది. భారత్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెనిజులా ప్రజల శ్రేయస్సే ప్రధానమని చెప్పుకొచ్చింది.
పరిష్కారం ఏమిటి..
ఈ సమస్యకు సైనిక పరిష్కారం కాకుండా.. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, దౌత్య చర్చలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెనిజులా – అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే ప్రాంతీయ సంస్థలతోపాటు ఐక్యరాజ్యసమితి పాత్ర కీలకమని చెబుతున్నారు.