అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jagadeesh Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంతోనే యూరియా కొరత ఏర్పడిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు గదారి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి నల్లగొండ లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో (BRS Party District Office) జగదీశ్‌రెడ్డి గురువారం విలేకరులతో మాట్లాడారు. నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోందని, రానున్న రోజుల్లో ఇది ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. యూరియా కోసం రైతులు నిద్రాహారాలు మాని పగలూరాత్రి లైన్లలో ఉంటూ అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Jagadeesh Reddy | చేతగాని సర్కారు..
పంట దిగుబడి మొత్తం యూరియాపైనే ఆధారపడి ఉంటుందని జగదీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) తెలిపారు. ఎకరానికి 20 వేల పెట్టుబడి పెట్టినా ఒక్క బస్తా యూరియా మీద దిగుబడి ఆధార పడి ఉందన్నారు. అలాంటి యూరియా సరఫరాలో (Urea Supply) విఫలమైన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. రైతులు రాత్రుళ్లు కూడా సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని, యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కుతున్నారన్నారు. అయినా రేవంత్ సర్కారు మొద్దునిద్ర వీడడం లేదన్నారు.
Jagadeesh Reddy | బీఆర్ఎస్ హయాంలో పుష్కలంగా..
తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఎరువుల కొరత రానీయలేదని మాజీ మంత్రి తెలిపారు. కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు చూపుతో వ్యవహరించే వారని, వేసవిలోనే గోదాముల్లో ఎరువులు నిల్వ చేసి పెట్టేవారన్నారు. వ్యవసాయ రంగంపై రెగ్యులర్‌గా రివ్యూ చేస్తూ రైతులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడేవాళ్లమన్నారు. సీజన్లో కనీసం నాలుగు సార్లు ముఖ్యమంత్రి సమీక్షించే వారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చాక రైతులకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయన్నారు. విత్తనాల కోసం, ఎరువుల కోసం ఇబ్బందులు పడడం దారుణమన్నారు. కాంగ్రెస్ వచ్చాక ధాన్యం కొనుగోళ్లకు కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కరెంట్ ఇబ్బందులు మొదలయ్యాయని, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.
Jagadeesh Reddy | కమీషన్ల కోసమే కొరత
యూరియా కొరత (Urea Shortage) వెనక కొంత మంది మంత్రులు, అధికారులు ఉన్నారని జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వారే కమీషన్ల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ చేసేందుకు కమీషన్లు తీసుకుంటున్నారన్నారు. గతంలో నల్లగొండ మంత్రి ధాన్యం కొనుగోళ్లలోనూ కమీషన్లు తీసుకుని రైతులను గాలికి వదిలేశాడని తెలిపారు. మేము అధికారంలోకి వస్తే అన్ని తెస్తామన్న రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy).. ఢిల్లీకి 56 సార్లు వెళ్లినా కనీసం ఎరువులు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకుని పదవులు తెచ్చుకునే కాంగ్రెస్ నేతలకు… రైతులను కాళ్లు పట్టుకునే దుస్థితికి తెచ్చారన్నారు. సీఎం, మంత్రులు సంపాదనపైనే దృష్టి పెట్టారు తప్పితే ప్రజల కష్టాలపై సోయి లేదన్నారు. యూరియా కొరత లేదని తప్పుడు ప్రకటనలు చేసే అధికారులు తస్మాత్ జాగ్రత్త.. మంత్రుల బాధ్యతను మీరు నెత్తిన వేసుకుని ఇబ్బందులు పడొద్దని హెచ్చరించారు.