అక్షరటుడే, వెబ్‌డెస్క్: Urea Shortage | ఎరువులు కొరతతో రైతాంగం ఆందోళన చెందుతోంది. యూరియా దొరకక తిప్పలు పడుతోంది. అదును దాటుతుండడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయని నవ్వాలో, యూరియా లేక ఏడ్వాలో తెలియని స్థితిలో రైతాంగం ఆగమవుతోంది. ఎరువుల కోసం రైతులు సొసైటీల ముందు, ఫర్టిలైజర్ షాపుల ముందు బారులు తీరుతున్నారు. మరోవైపు, కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఓ సొసైటీలో చూసినా, ఏ షాపులో అడిగినా నో స్టాక్ (No Stock) అని చెబుతున్నారు.
Urea Shortage | యూరియా కోసం జాగారం..
యూరియా వచ్చిందని తెలిస్తే చాలు రైతులు (Farmers) సొసైటీల ఎదుట బారులు తీరుతున్నారు. పొద్దంతానే కాదు, తెల్లార్లు జాగారాం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుటే రైతులు నిద్రకు ఉపక్రమించారు. సోమవారం రాత్రి 12 గంటలకు వచ్చి లైన్‌లో పడుకున్నారు. మహిళా రైతులు (Women Farmers) సైతం అక్కడే జాగారం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట తెల్లవారక ముందే రైతులు బారులు తీరారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్ ప్రతులను వరుసలో పెట్టారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది.
Urea Shortage | సరఫరా అంతంతే..
ఎరువుల అవసరాలకు సంబంధించిన అంచనాలకు, వాస్తవ పంపిణీకి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. రాష్ట్రానికి గతానికంటే ఈసారి యూరియా కేటాయింపులు తగ్గిపోయాయి. అవసరమైన మేరకు కేంద్రం నుంచి ఎరువులు రావడం లేదని, దీంతోనే సమస్య ఏర్పడిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ సీజన్‌లో అన్ని ఎరువులు కలిపి సుమారు 23 లక్షల టన్నులు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు అన్ని ఎరువులు కలిపి 16.52 లక్షల టన్నుల మేర కంపెనీలు సరఫరా చేయాలి. ప్రస్తుతానికి 7.8 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే సరఫరా చేసిన కంపెనీలు 8.72 లక్షల టన్నులకు కోతపెట్టాయి. దీంతో రాష్ట్రంలో యూరియాకు (Urea) కొరత ఏర్పడింది.
Urea Shortage | భిన్నవాదనలు..
ఎరువుల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలో వాదన వినిపిస్తున్నాయి. కేంద్రం సరిపడా ఎరువులు సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఆరోపిస్తోంది. కేటాయింపుల్లో భారీగా కోత పెట్టిందని, ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించడం లేదని చెబుతోంది. ఇప్పటికే పదికిపైగా లేఖలు రాశానని, స్వయంగా వెళ్లి కలిసినా సరిపడా ఎరువులు రావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Agriculture Minister Tummala Nageswara Rao) ఇటీవల తెలిపారు.
రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాను కేంద్రం విడుదల చేయడం లేదని, ఎరువుల కొరతలో తమ వైఫల్యం లేదని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బఫర్ స్టాక్‌ను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన కోటా ఎప్పుడో ఇచ్చేశామని కేంద్రం చెబుతోంది. నిర్వహణ, పంపిణీ సరిగ్గా లేకే సమస్యలు తలెత్తాయని పేర్కొంటోంది. దేశంలో యూరియా కొరత లేదని, కోటా కంటే ఎక్కువగానే ఇచ్చేశామని లెక్కలు చెబుతోంది. యూరియాతో పాటు నానో యూరియా (Nano Urea) వాడకాన్ని పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని సూచిస్తోంది.