అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Urea Shortage | యూరియా కొరత తీవ్ర మరింత తీవ్రమైంది. సరిపడా స్టాక్ (Urea Stock) రాకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. అదను దాటుతుండడంతో ఆగ్రహానికి లోనవుతున్న రైతులు (farmers).. పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు.
అర్ధరాత్రి నుంచి సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకక పోవడంతో ధర్నాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy district) మాచారెడ్డి మండలంలో రైతులు ధర్నాకు దిగారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగాయి.
Urea Shortage | అదను దాటుతోంది..
ప్రస్తుత సీజన్‌లో యూరియా కొరత రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించింది. అదను దాటుతుండడంతో దిగుబడి రాదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి పంటకు (paddy crop) రైతులు మూడు దఫాలుగా యూరియా వేస్తారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రస్తుతం వేర్వేరు దశలో వరిపైరు ఉంది.
కొన్ని చోట్ల మొదటి దఫా యూరియా చల్లాల్సి ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో రెండో విడుత వేయాల్సి ఉంది. ఇక, ముందస్తుగా వేసిన వరి పొట్ట దశలో ఉంది. అయితే, ఎరువులు వేయాల్సిన సమయం మించి పొతుండడం, యూరియా దొరకక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సరైన సమయంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోతుందని వాపోతున్నారు.
Urea Shortage | సరిపడా లేని సరఫరా
సరఫరాలో అంతరాయం వల్లే యూరియా కొరత ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రానికి రావాల్సిన కోటాలో సగం కూడా రాలేదని, కేంద్ర ప్రభుత్వాన్ని (central government) ఎన్నిసార్లు అడుగుతున్నా పంపించడం లేదని పేర్కొంటోంది. బఫర్ స్టాక్‌తో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు (Agriculture department officials) చెబుతున్నారు. రెండ్రోజులుగా కేంద్రం నుంచి స్టాక్ వస్తున్నదని, వచ్చిన యూరియాను వచ్చినట్లు జిల్లాలకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశమంతటా యూరియా కొరత ఉందని గుర్తు చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి తగ్గడం, ఫ్యాక్టరీల్లో బ్రేక్ డౌన్ కారణంగా సరఫరాలో అంతరాయం జరిగిందని చెబుతున్నారు.