అక్షరటుడే, కామారెడ్డి : Urea Shortage | జిల్లాలో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పంటలకు యూరియా అవసరం కాగా.. దొరకకపోవడంతో గంటల తరబడి లైన్లో నిల్చుంటున్నారు. రైతుల (Farmers) అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న ఎరువుల డీలర్లు అవసరం లేకపోయిన పురుగు మందులు అంటగడుతున్నారు. పురుగు మందులు కొంటేనే యూరియా విక్రయిస్తున్నారు. దీంతో చేసేదేమిలేక రైతులు పురుగు మందులు కూడా కొనుగోలు చేస్తున్నారు.
యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అదేశించి 24 గంటలు కూడా గడవకముందే అన్నదాతలకు అనవసరంగా పురుగుల మందు అంటగట్టిన ఘటన కామారెడ్డి (Kamareddy)లో వెలుగు చూసింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మంచాల పెద్ద మల్లేష్, మంచాల చిన్న మల్లేష్ కామారెడ్డిలోని మన గ్రోమోర్లో యూరియా తీసుకోవడానికి వచ్చారు. ఒక్కో యూరియా బస్తా ధర రూ.271 కావడంతో రూ.1897 అవుతుంది. అయితే గ్రోమోర్ నిర్వాహకులు పురుగుల మందులు కొంటేనే యూరియా ఇస్తామని కండిషన్ పెట్టారు. లేకపోతే యూరియా లేదని చెప్పడంతో రూ.3 వేలు పెట్టి పురుగుల మందులు తీసుకున్నారు. తాము రూ.5 వేల విలువైన యూరియా, పురుగు మందు కొనుగోలు చేస్తే బిల్లు ఇవ్వలేదని, ఇంటికి వెళ్లాక రూ.7,208 ఫర్టిలైజర్ కొనుగోలు చేసినట్టుగా తమ ఫోన్కు మెసేజ్ వచ్చిందని రైతులు తెలిపారు.
Urea Shortage | బిల్లుతో బయటపడిన వ్యవహారం
రైతులకు సంబంధించిన విషయమై గ్రోమోర్ నిర్వాహకుల వివరణ కోసం వెళ్లగా తాము ఎలాంటి మందులు రైతులకు అంటగట్టలేదన్నారు. రైతులకు ఏది అవసరమో అదే ఇస్తామన్నారు. మందుల విషయాన్ని రైతులను అడుగుతామని, వద్దంటే బలవంతంగా ఇవ్వడం లేదన్నారు. అయితే బిల్లు విషయమై అడిగే సమయంలో మండల వ్యవసాయ అధికారి (AO) పవన్ కుమార్ గ్రోమోర్ (Gromor)కు రావడంతో బిల్లు విషయమై నిర్వాహకులను ప్రశ్నించారు.
రైతు ఫోన్ నంబర్ ఆధారంగా బిల్లు ప్రింట్ తీయగా అదనంగా రూ.2 వేల పైచిలుకు బిల్లు ఉంది. ఇదేంటని ప్రశ్నించగా మరొక రైతుకు సంబంధించిన పురుగుల మందు డబ్బా బిల్లు ఈ రైతు బిల్లులో యాడ్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక రైతు బిల్లులో మరొకరి బిల్లు చేర్చడం ఏమిటని ఏవో ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అవసరం లేకున్నా మందులు అంటగట్టిన విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారికి నివేదిస్తామని ఏవో తెలిపారు.
Urea Shortage | కలెక్టర్ ఆదేశించిన 24 గంటల్లోపే..
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) సోమవారం సాయంత్రం మన గ్రోమోర్ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసి యూరియా నిల్వలను పరిశీలించారు. యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అయినా గ్రోమోర్ నిర్వాహకులు రైతులకు పురుగు మందులు అంటగట్టడం గమనార్హం. బలవంతంగా పురుగుల మందులు అంటగడుతున్న ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

గ్రోమోర్ దుకాణంలో తనిఖీ చేస్తున్న ఏవో పవన్ కుమార్
